ఎన్నికల వేళ.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఎన్నికల వేళ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ: క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై నేడు సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ప్రస్తుత ప్రజా ప్రాతినిథ్యం చట్టం ప్రకారం.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో (హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటివి) దోషులుగా తేలితేనే పోటీ చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం జైలుశిక్ష అనుభవించిన నాయకులు మాత్రమే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని చట్టం పేర్కొంటొంది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై గతంలో అత్యున్నత న్యాయస్థానం విచారించింది.
ఆగస్టు 28వ తేదీన తుది వాదనలు పూర్తయ్యాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని.. కానీ పార్టీ గుర్తు పోటీ చేయరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
కాగా అనర్హతకు సంబంధించిన ప్రజా ప్రాతినిథ్య చట్టం ఉన్నందున శాసన వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోరాదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు.
వచ్చేది ఎన్నికల కాలం కావడంతో.. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.