గుజరాత్ లో కాంగ్రెస్ ఓటమికి ఏడు కారణాలు
గుజరాత్ లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో తెలుసా ?
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు.. గుజరాత్ లో కాంగ్రెస్ ఓటమికి కూడా అనేక కారణాలు. గెలుపుకు అవకాశం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గుజరాత్ లో కాంగ్రెస్ ఓటమికి గల ప్రధాన కారణాలను ఒక్కసారి పరిశీలిద్దాం...
1) పనిచేసిన మోడీ చరిష్మా...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సులభంగా విజయం సాధిస్తామని పాలకపక్ష భారతీయ జనతా పార్టీ భావిస్తున్న తరుణంలో ప్రతికూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. పటేళ్ల రిజర్వేషన్ల అంశం, ముస్లిం వర్గంలో మోడీపై ఉన్న వ్యతిరేకత, పార్టీలో రెబెల్స్ బెడద, ప్రభుత్వ వ్యతిరేకత, సమర్థ నాయకత్వం లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ మోడీ చరిష్మ తుడిచిపెట్టేసింది. మోడీ రంగంలోకి దిగనంత వరకు ఇవన్ని పెద్ద సమస్యలుగా కనిపించాయి.. కానీ ఆయన రంగంలోకి దిగిన తర్వాత ఆ సమస్యలన్నీ వాటంతట అవే సమసిపోయాయి. ఏది ఏమైనా ప్రధాని మోడీ తన రాజకీయ చతురతతో బీజేపీకి మరో విజయాన్ని అందించారనడంలో ఎటువంటి సందేహం లేదు.
2) రెబల్స్ బెడద తట్టుకొని నిలబడిన వైనం..
గుజరాత్ ఎన్నికల సమయంలో బీజేపీలో రెబెల్స్ బెడద ఉంది. ఏకంగా 24 మంది తిరుగుబాటుదారులు స్వతంత్య్రంగా లేదా ఇతర పార్టీల అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు. వారిలో ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొంత మంది పోటీ చేస్తున్నారు. వారందరిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు. ఇంతటిస్థాయిలో రెబల్స్ ను తట్టుకొని బీజేపీ విజయం సాధించడం ఆశామాషీగా జరిగే పనికాదు. ప్రధాని మోడీ చాకచక్యంగా వ్యవహించిన తీరు గుజరాత్ లో బీజేపీ అధికారంలో వచ్చేందుకు దోహదపడింది.
3) రిజర్వేషన్ల వివాదానికి అభివృద్దితో సమాధానం:
ప్రత్యర్ధి పార్టీ రిజర్వేషన్ల అస్త్రం ఉపయోగించినప్పటికీ బీజేపీ ఏ మాత్రం బెదరలేదు. అభివృద్ది నినాదంతో ఎన్నికలకు వెళ్లి సాహసోపేతంగా వ్యవహరించింది. కాగా గుజరాత్ ప్రజలు బీజేపీ నినాదం వైపే మొగ్గు చూపారు. దీంతో బీజేపీ ఈ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించగలిగింది.
4) రామ మందిరానికి వ్యతిరేకంగా కపిల్ సిబాల్ వాదన
సుప్రీం కోర్టులో అయోధ్య భూవివాదంపై విచారణ జరగడం భాజపాకు కలిసి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత విచారణ చేపట్టాలన్న కపిల్ సిబల్ అభ్యర్థనను ఆ పార్టీ తప్పుబట్టింది. ‘ఇక్కడ హిందూ దేవాలయాలను సందర్శిస్తూ.. అక్కడ అయోధ్య ఆలయాన్ని అడ్డుకుంటున్నారు’ అంటూ పల్లవి అందుకుంది. దీనికితోడు సున్నీ వక్ఫ్‌బోర్డు కూడా కపిల్ సిబల్ వాదనను తప్పుబట్టడం.. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరిగా భాజపా ప్రచారం చేసింది. పదే పదే ‘మీ వైఖరేంటో చెప్పాలి’ అంటూ ఆ పార్టీని నిలదీసింది. దీన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది.. అయితే కపిల్ సిబాల్ అంశం కూడా గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
5) పనిచేసిన మోడీ 'పాక్' అస్త్రం
గుజరాత్ ఎన్నికల్లో అన్ని ప్రతికూల పవనాలు వీస్తున్న తరుణంలో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన మోడీ ..తన రాజకీయ అనుభావాన్ని ఉపయోగించారు. ప్రజల దృష్టిని రిజర్వేషన్ల అంశం నుంచి మరల్చేందుకు పాకిస్థాన్ అస్త్రాన్ని ప్రయోగించారు. గుజరాత్ ఎన్నికలకు పాక్ ప్రమేయం ఉందని.. కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో గెలుపొందేందుకు దాయాది దేశం సాయం తీసుకుంటున్నాని ప్రచారం చేశారు. అయితే బీజేపీ చేసిన ఈ ఆరోపణలని కాంగ్రెస్ సమర్థవంతంగా తిప్పికొట్టేలేకపోయింది. దీంతో గుజరాత్ ప్రజలు మోడీ విమర్శలను నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా మోడీ ప్రయోగించిన అస్త్రాలన్నీ గుజరాత్ ఎన్నికల్లో గెలుపొందేందుకు దోహదపడ్డాయి.
6) కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చిన పటేల్ వర్గీయులు
గుజరాత్ ఎన్నికల్లో పటేల్ వర్గమంతా తమ వైపు ఉంటుందని ఆశించిన కాంగ్రెస్ కు ఘోర భంగపాటు ఎదురైంది. ఆశించిన స్థాయిలో ఆ వర్గం వారు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. పటేళ్ల ప్రాబల్యం అధికంగా ఉన్న సౌరాష్ట్రలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం అందుతున్న సరళిని బట్టి బీజేపీ 22 స్థానాలు కైవసం చేసుకుంది. కాగా కాంగ్రెస్ 19 చోట్ల మాత్రమే విజయం సాధించగల్గింది. అంటే పటేళ్లు కూడా బీజేపీకే బ్రహ్మరథం పట్టినట్లు ఎన్నికల ఫలితాలనిబట్టి అర్థమవుతోంది.
7) మణిశంకర్ ‘నీచ్’ వ్యాఖ్యలు..
గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యార్ 'నీచ్' అని సంబోధించారు. దీన్నే ప్రచార అంశంగా తీసుకొని.. కాంగ్రెస్ వారు తనను తక్కువ తనను జాతివాడి (నీచ్ ) గా సంభోదిస్తున్నారని మోడీ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. దీనిపై ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈ స్థాయిలో దూషించడంపై ప్రజలు కన్నెర్రచేశారు. దీనికి తోడు ప్రధాని హోదాలో ఉన్న మోడీ గుజరాతీయుడు కావడంతో ఇది మరింత సెంటిమెంట్ గా మారింది. ఇలా మోడీ ప్రజల్లో సానుభూమి సంపాదించడంలో సక్సెస్ అయ్యారు. గుజరాత్ కాంగ్రెస్ ఓటమికి ఈ అంశమే పూర్తి కారణం కాకపోయినప్పటికీ ఇదొక ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.