న్యూఢిల్లీ: నూతన సంవత్సరం కానుకగా వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం తీపి కబురు వినిపించింది. రాయితీ కలిగిన సిలిండర్‌పై రూ.5.91 తగ్గించిన కేంద్రం రాయితీ లేని వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.120.50 తగ్గిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న మంగళవారం నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. నెల రోజుల వ్యవధిలో వంట గ్యాస్ ధరలు వరుసగా తగ్గడం ఇది రెండోసారి. డిసెంబర్ 1న సైతం రాయితీ కలిగిన ఎల్పీజీ సిలిండర్‌పై కేంద్రం రూ.6.52 తగ్గించిన సంగతి తెలిసిందే. ధరల తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ కలిగిన ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 494.99 పలకనుంది. 


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం ఈ ధరల తగ్గింపునకు ఓ కారణమైతే, డాలర్‌తో పోల్చుకుంటే, రూపాయి విలువ కొంత బలపడటం మరో కారణంగా మార్కెట్ వర్గాలు తెలిపాయి.