Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం సంచలన తీర్పు, ఇదే న్యాయం అంటున్న బిల్కిస్
Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తనకెంతో సంతోషాన్ని కల్గించిందని..న్యాయమంటే ఇదేనని బాధితురాలు బిల్కిస్ బానో చెప్పారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. సామూహిక అత్యాచారంతో పాటు 8 మందిని హత్య చేసిన కేసులో దోషులకు రెమిషన్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు మండిపడింది. రెండు వారాల్లోగా జైలుకు తరలించాలని కోర్టు స్పష్టం చేసింది.
2002 గుజరాత్ అల్లర్లలో 5 నెలల గర్భిణీగా ఉన్న 21 ఏళ్ల బిల్కిస్ బానోపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె మూడేళ్ల కూతురితోపాటు ఏడుగురు కుటుంబసభ్యుల్ని హత్య చేశారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు 11 మందిని దోషులుగా ఖరారు చేస్తూ 2008లో జీవిత ఖైదు విధించింది. ఆ తరువాత బోంబే హైకోర్టు సైతం ఈ తీర్పును సమర్ధించింది. కాగా 15 ఏళ్ల జైలు శిక్ష అనంతరం తమను విడుదల చేయాలని కోరుతూ ఓ దోషి 2022లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే..పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు సూచనతో గుజరాత్ ప్రభుత్వం ఓ కమిటీ నియమించి ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా 11 మందికి రెమిషన్ విదించడంతో 2022 ఆగస్టు 15న అంతా విడుదలయ్యారు.
గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బిల్కిస్ బానో సహా దేశమంతా వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేయగా..సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది పూర్తిగా మతి లేని నిర్ణయమని మండిపడింది. దోషులతో కుమ్మక్కైన గుజరాత్ ప్రభుత్వం తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపింది. ఓ మహిళపై ఇంత క్రూరంగా నేరానికి పాల్పడితే శిక్ష తగ్గింపుకు ఆస్కారమెలా ఉంటుందని నిలదీసింది. ఈ తరహా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి జాతి, మతం, విశ్వాసాలతో నిమిత్తం ఉండకూడదని తెలిపింది. ఈ కేసులో దోషులు వాస్తవాల్ని ఏమార్చి సుప్రీంకోర్టు ద్వారా రెమిషన్ పరీశీలన ఆదేశాలు పొందారని కోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే రెండు వారాల్లోగా నిందితులంతా సరెండర్ అయ్యేట్టు చూడాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆనందం వ్యక్తమౌతోంది. తీర్పుపై బాధితురాలు బిల్కిస్ బానో సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఎంతో ఉపశమనం కల్గిస్తోందన్నారు. న్యాయమంటే ఇదేనన్నారు. ఏడాదిన్నర తరువాత సంతోషం కలిగిందన్నారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అసదుద్దీన్ ఒవైసీ, కల్వకుంట్ల కవిత సహా అంతా స్పందించారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook