నేడే చివరి షో ; ఎన్నికల ప్రచార ధూం ధాంకు ఇక తెర
హరో హోరీగా సాగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది.
తెలంగాణ ఎన్నికల ప్రచార హోరు ఈ రోజుతో మూగబోతుంది. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. పోలింగ్ కు 48 గంటల ముందుగా ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరదించనున్నారు. ఇరువర్గాలు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. చివరి రోజు సాధ్యమైనన్ని నియోజకవర్గాలు చక్కెర్లు కొట్టి ప్రచారం నిర్వహించాలని నేతలు ప్లాన్ రెడీ చేసుకున్నారు
ఎల్లుండే పోలింగ్..ఏర్పాట్లు పూర్తి
మరో రెండు రోజుల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఆయా నియోజకవర్గాలకు పంపేందుకు ఈవీఎంలు,వీవీపీఏటీలను సిద్ధం చేశారు. ఈవీఎంలపై అతికించే బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణపూర్తి చేశారు. . రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగ్ నిర్వహణకు 32 వేల 815 కేంద్రాల ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఆటో రిక్షాలు, వాహనాల సదుపాయం కల్పిస్తున్నారు. పోలీంగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు