తమిళనాడు రాజకీయాల్లోకి కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన పార్టీని ప్రకటించగా, తాజాగా అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా దినకరన్‌ కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాడంటూ తమిళ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగింది. ఈ నేపథ్యంలోనే మార్చి 15వ తేదీన కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానని దినకరన్ స్పష్టం చేశారు. పార్టీ పేరుతో పాటు చిహ్నాన్ని కూడా ఆరోజే వెల్లడిస్తానని చెప్పారు. మధురైలో బహిరంగ సభ ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించనున్నారు. కమల్ కూడా మధురై వేదికగా కొత్త పార్టీని ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్రమ ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లిన తర్వాత సీఎం పళని స్వామి.. పన్నీర్‌ సెల్వంతో దోస్తీ కట్టి అన్నాడీఎంకే పార్టీని గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే శశికళ-దినకరన్‌ వర్గంపై వేటు వేసి, పార్టీ నుంచి బహిష్కరించారు. అయినా, ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో దినకరన్‌ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.


పార్టీలో సభ్యత్వం, రెండాకుల గుర్తును కూడా కోల్పోవడంతో దినకరన్‌ కొత్త పార్టీ దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. కొత్త పార్టీ విషయమై శశికళతో దినకరన్ చర్చలు కూడా జరిపారని సమాచారం.  కాగా, దినకరన్ కొత్త పార్టీ పెడితే శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఆయనతో కలిసి వెళ్తారా? లేదా అన్నది  తెలియాల్సి ఉంది. ఏ విషయమో పార్టీ ప్రకటన తర్వాతే తెలుస్తుంది.