భారత్ బంద్: ఆస్పత్రికి వెళ్లే దారిలో రెండేళ్ల చిన్నారి మృతి!
బీహార్‌లోని జహనాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భారత్ బంద్‌లో పాల్గొన్న ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో జహనాబాద్‌లో ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అదే మార్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రెండేళ్ల చిన్నారిని జహనాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్న ఆటో రిక్షా వాహనం సైతం నిలిచిపోయింది. దీంతో సకాలంలో వైద్యం అందకపోవడంతో రెండేళ్ల చిన్నారి జహనాబాద్ శివార్లకు చేరుకునేలోపే ప్రాణం విడిచింది. భారత్ బంద్ కారణంగా ఇవాళ తనకు ఒక్క వాహనం కూడా లభించలేదని, ఎలాగోలా ఒక ఆటో రిక్షా తీసుకుని అందులో తన కూతురిని జహనాబాద్ తీసుకెళ్లేందుకు యత్నించినప్పటికీ, అప్పటికే ఆలస్యమైన కారణంగా తన కూతురు రోడ్డుపైనే ప్రాణాలు విడిచిందని ఆ చిన్నారి తండ్రి మాంఝి బోరుమన్నాడు.
సాధారణంగా అయితే జహనాబాద్ చేరుకోవడానికి కేవలం 1 గంట మాత్రమే పడుతుంది కానీ ఇవాళ మూడు గంటలైనా అక్కడకు చేరుకోలేకపోయానని మాంఝి ఆవేదన వ్యక్తంచేశాడు. భారత్ బంద్ కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందనే వార్తపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. మైనర్ బాలిక ప్రాణం పోవడానికి కారణమైన ఆందోళనలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం వివరణ ఇచ్చుకుంటుందని ప్రశ్నించారు.