రాజస్తాన్ గగనతలంపై డ్రోన్‌ని కూల్చేసిన ఆర్మీ
రాజస్తాన్ గగనతలంపై డ్రోన్‌ని కూల్చేసిన ఆర్మీ
జైపూర్: రాజస్తాన్‌లోని గంగానగర్ గగనతలంపై అనుమానాస్పదంగా విహరిస్తున్న ఓ డ్రోన్‌ని ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. గంగానగర్ సెక్టార్‌లో శనివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇంతకుమించి ఈ ఘటనకు సంబంధించిన మరే ఇతర వివరాలను రక్షణ శాఖ వెల్లడించలేదు.
ఇదిలావుంటే, మార్చి 4న సైతం భారత వాయుసేన ఇదే తరహాలో పాకిస్తాన్ మిలిటరీ డ్రోన్‌ని కూల్చేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ లోని బికనేర్ సెక్టార్‌లో ఓ డ్రోన్ విహరిస్తున్నట్టుగా వాయుసేనకు చెందిన రాడార్లు గుర్తించిన కొన్ని నిమిషాల్లోనే భారత యుద్ధ విమానం సుఖోయ్-30 రంగంలోకి దిగి దానిని మిస్సైల్ సహాయంతో కూల్చేసింది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ వద్ద వున్న ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు జరిపిన అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొంది.