వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపిన అమిత్ షా, పియుష్ గోయల్
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ప్రారంభించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్, మరో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌లతో కలిసి అమిత్ షా జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 'జమ్మూకశ్మీర్ ప్రజలకు ఈ రైలు అతిపెద్ద బహుమతిగా నిలుస్తుంది' అని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్దికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఓ సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. రాబోయే పదేళ్లలో జమ్మూను అత్యంత అభివృద్ది చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అమిత్ షా హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ మాట్లాడుతూ.. 'వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది' అని అన్నారు. అక్టోబర్ 5 నుంచి ఈ రైలు సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఐఆర్‌సీటీసీ ద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి సంబంధించిన టికెట్లను కొనుగోలు చేయొచ్చని తెలిపారు. 2022 ఆగస్ట్ 15 లోగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వేను అనుసంధానం చేస్తామని పీయుష్ గోయల్ పేర్కొన్నారు.