లక్నో: హిందూ సమాజ్ పార్టీ నేత కమలేష్ తివారి హత్య కేసుపై విచారణ వేగవంతమైంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ పోలీసుల బృందం కలిసి జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో గుజరాత్‌లోని సూరత్‌లో ముగ్గురు, ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్నొర్‌లో ఇద్దరు అనుమానితులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ బృందాలు నాగపూర్‌లో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. కమలేష్ తివారి హత్య అనంతరం సూరత్‌లో అరెస్ట్ అయిన ముగ్గురిలో ఒకరు నాగపూర్‌లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి హత్య వివరాలు వెల్లడించినట్టు పోలీసుల విచారణలో తేలిన అనంతరమే నాగపూర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.


యూపీలో సంచలనం సృష్టించిన కమలేష్ తివారి హత్య కేసులో నిందితులు ఎవరైనా.. ఎక్కడి వారైనా వారికి కఠి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. నిన్నటి వరకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. నేడు తివారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు సీతాపూర్‌లోని తివారి నివాసంలో ముఖ్యమంత్రి వారిని పరామర్శించనున్నారు.