న్యూఢిల్లీ: అయోధ్య తీర్పు వెల్లడి నేపథ్యంలో వాట్సాప్, ఫేస్‌బుక్‌, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం సామాజిక మాథ్యమాల్లో చేపట్టే చర్చల కారణంగా హింస చెలరేగే ప్రమాదం ఉన్నందున.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతంబుద్ధ్ నగర్ లో యూపీ పోలీసులు సైబర్, మీడియా సెల్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్‌, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాథ్యమాల్లో వైరల్ అవుతోన్న పోస్టులు, సందేశాలు, ఫోటోలు, వీడియోలపై నిఘాను పెట్టారు. 


తీర్పు వెల్లడి అనంతరం అయోధ్యతో పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ఇతర ప్రాంతాల్లోనూ పలు అసాంఘీక శక్తులు అరాచకాలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదని భావించిన పోలీసులు.. వారిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే తాము జారీ చేసిన నిబంధనలు, సూచనలకు విరుద్దంగా వ్యవహరించిన 50 వాట్సాప్ గ్రూప్స్ అడ్మిన్స్, 70 మందిని గుర్తించిన పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు.