రానున్న 2019 ఎన్నికల్లో ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయనున్నారా అంటే అవుననే అంటున్నాయి అక్కడి రాజకీయ వర్గాలు. వివి వినాయక్ వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గతేడాది చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాను డైరెక్ట్ చేసిన వినాయక్ ఈ ఏడాది మరో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సినిమాతో మార్చి 9వ తేదీన ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇంటిలిజెంట్ పేరిట తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవలే బాలయ్య బాబు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.


ఇదిలావుంటే, ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రాజమండ్రి వేదిక కానుంది. సరిగ్గా వివి వినాయక్ తీసుకున్న ఈ నిర్ణయమే ఆయన రాజకీయరంగ ప్రవేశంపై పలువురికి అనుమానం తలెత్తేలా చేసింది. రానున్న ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నందువల్లే తన పొలిటికల్ క్యాలిబర్‌ని పెంచుకోవడం కోసం వినాయక్ తన తర్వాతి సినిమా ఫంక్షన్‌ని రాజమండ్రిలో ఏర్పాటు చేశాడు అనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో రాజమండ్రి, వైజాగ్, విజయవాడ లాంటి పట్టణాల్లో సినిమా ఫంక్షన్స్ జరగడం సర్వసాధారణమే అయినప్పటికీ, వివి వినాయక్ చేయనున్న ఈ వేడుక వెనుకున్న ఉద్దేశం వేరే అనేది ఆ టాక్ సారాంశం. ఈ ప్రచారంపై వినాయక్ ఏమని స్పందిస్తాడో చూడాలి మరి!!