నేటి నుంచి `రామరాజ్య రథయాత్ర` ప్రారంభం
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని కర్సేవక్పురం నుండి `రామరాజ్య రథయాత్ర` ను జెండా ఊపి ప్రారంభిస్తారు.
దేశంలోనే అత్యంత కీలకమైన అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీదు కేసు తుది విచారణ సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తలపెట్టిన 'రామరాజ్య రథయాత్ర' నేడు అయోధ్యలో ప్రారంభం కానుంది. రామ రథం, వచ్చే రెండు నెలల వ్యవధిలో ఆరు రాష్ట్రాల్లో పర్యటిస్తూ, తమిళనాడులోని రామేశ్వరంలో యాత్రను ముగించనుంది. అయోధ్య ఉద్యమం గురించి అవగాహన కల్పించాలనే లక్ష్యంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ తొలి రథయాత్రను 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు చేపట్టిన సంగతి తెలిసిందే..!!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని కర్సేవక్పురం నుండి యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల నుంచి యాత్రకు వెళుతుంది.
రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసును "పూర్తిగా భూ వివాదం" గా పరిగణిస్తామని సుప్రీంకోర్టు గతవారం స్పష్టం చేసింది.
అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన అనంతరం దేశంలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య అనేక నెలలు మత ఘర్షణలు జరిగాయి. సుమారు 2,000 మంది మరణించారు.