వీడియో స్టంట్: ఆర్కే నగర్ ఎన్నికల్లో కీలక మలుపు
ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోలింగ్‌కు కొంత సమయం ముందు మీడియా ముందుకు వచ్చిన ఓ వీడియో ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది.
ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోలింగ్‌కు కొంత సమయం ముందు మీడియా ముందుకు వచ్చిన ఓ వీడియో ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆ వీడియోను దినకరన్ వర్గీయులు విడుదల చేశారు. దినకరన్ ఇప్పటికే ఈ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే జయలలిత మరణ విషయంలో దినకరన్ గ్రూపుపై ఆరోపణలు చేస్తున్నవారికి సమాధానం ఇచ్చేందుకు.. ఈ క్రమంలో సానుభూతిని పొంది ఓట్లను చీల్చేందుకే ఈ ప్రయత్నమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.ఆసుపత్రిలో జ్యూస్ తాగుతూ.. టీవీ చూస్తున్నట్లు ఉన్న ఈ వీడియో బహిర్గతం అయ్యాక దినకరన్ మీడియాతో మాట్లాడారు. ఇదే వీడియో ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు పన్నీర్ సెల్వం వద్ద కూడా ఉన్నట్లు తెలిపారు.
అయితే దినకరన్‌కు అమ్మ మరణానికి సంబంధించి అన్ని విషయాలు తెలిసి కూడా ఆయన నాటకాలాడుతున్నారని పెరంబూర్ ఎమ్మెల్యే వెట్రివేల్ ఆరోపణలు చేశారు. ఆర్కేనగర్ నుంచి ఏఐఏడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, డీఎంకే అభ్యర్థి గణేశన్, స్వతంత్ర అభ్యర్థి దినకరన్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ సమయంలోనే వీడియోను బహిర్గతం చేయడం ద్వారా దినకరన్ సేఫ్ గేమ్ ఆడుతున్నారని.. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ వీడియో విడుదల చేయకుండా.. సమయం చూసి విడుదల చేయడం రాజకీయ కుట్రేనని అనుకుంటున్నారు. అలాగే అది అసలు వీడియో కాదని.. నకిలీ వీడియో అని కూడా పన్నీర్ సెల్వం వర్గీయులు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. దినకరన్ వర్గం విడుదల చేసిన వీడియో ఆర్కేనగర్ ఉప ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని.. దానిని వెంటనే టీవీల్లో చూపించడాన్ని నిషేధించాలని ఎన్నికల సంఘం అన్ని టీవీ ఛానెళ్లు, పత్రికా కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది