మనకు 15 రోజులు అవసరం లేదు : కర్ణాటక సీఎం యడ్యూరప్ప
అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కోవడానికి తనకు 15 రోజుల సమయం అవసరం లేదు : యడ్యూరప్ప
అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కోవడానికి తనకు 15 రోజుల సమయం అవసరం లేదు అని అన్నారు కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప. బల పరీక్ష కోసం కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా బీజేపీ సర్కార్‌కి 15 రోజుల సమయం ఇవ్వడంపై స్పందిస్తూ యడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై గురువారం యడ్యూరప్ప బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేతిలో రిసార్ట్‌లో బంధీలుగా వున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారనే విశ్వాసం తనకు వుంది అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తంచేశారు. మేమే అధికారంలో వున్నాం... మేమే మెజారిటీ నిరూపించుకుంటాం. అందులో ఏ సందేహం అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు. రిసార్ట్స్‌లో చాలా దారుణమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దాచిపెట్టింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేతిలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీపై యడ్యూరప్ప విమర్శలు గుప్పించారు.
ఎప్పుడైనా, ఏ క్షణమైనా తమకు అసెంబ్లీలో మొదటి సెషన్స్ నిర్వహించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుండవచ్చు అని బీజేపీ ఎమ్మెల్యేలతో చెప్పిన యడ్యూరప్ప.. పార్టీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలు తప్పకుండా హాజరవ్వాల్సిందిగా వారికి సూచించారు.