పుల్వామా ఎటాక్: పర్వేజ్ ముషారఫ్, ఫవద్ చౌదరిలకు ఆహ్వానాలు ఉపసంహరించుకున్న వియాన్
పుల్వామా ఎటాక్: మనసు మార్చుకున్న వియాన్
న్యూఢిల్లీ: పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన 40కిపైగా జవాన్లను పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన వక్తలకు పంపిన ఆహ్వానాలను వియాన్ న్యూస్ ఛానెల్ తిరిగి ఉపసంహరించుకుంది. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో జరగనున్న దక్షిణ ఆసియా అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా పాకిస్తాన్‌కి చెందిన పర్వేజ్ ముషారఫ్, ఫవద్ చౌదరిలకు వియాన్ తొలుత ఆహ్వానాలు పంపించింది. అయితే, ఫిబ్రవరి 14న జమ్ముకాశ్మీర్‌లో జరిగిన దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినడంతో వారికి పంపిన ఆహ్వానాలను తిరిగి ఉహసంహరించుకున్నట్టు తాజాగా వియాన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
పర్వేజ్ ముషారఫ్, ఫవద్ చౌదరిలతో పాటు భారత్ లో గతంలో పాకిస్తాన్ హై కమిషనర్ గా వ్యవహరించిన అబ్దుల్ బాసిత్, పాకిస్తాన్ మాజీ విదేశీ కార్యదర్శి సల్మాన్ బషీర్‌లకు సైతం పంపిన ఆహ్వానాలను ఉపసంహరించుకుంటున్నట్టు వియాన్ న్యూస్ ఛానెల్ వెల్లడించింది.