ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఓ మహిళ తన కుటుంబంతో సహా వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కులదీప్ సింగ్ తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. ఈ క్రమంలో తాను స్థానిక పోలీస్ స్టేషనులో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆమె తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం వల్లే ఆయనకు భయపడి ఎవరూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ మహిళ తెలిపింది. వెంటనే ఆ ఎమ్మెల్యేని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. సీఎం ఇంటి ముందు ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది అని తెలియగనే.. ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.


ఈ విషయం గురించి ఏఎన్‌ఐతో ఎమ్మెల్యే కులదీప్ సింగ్ మాట్లాడుతూ ఇవన్నీ ఎవరో తనంటే కిట్టని వారు ఆడిస్తున్న నాటకాలని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గతంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ తరఫున కూడా పోటీ చేశారు. ఇదే కేసుపై లక్నో సీనియర్ పోలీస్ ఆఫీసర్ రాజీవ్ కిషన్ కూడా స్పందించారు. "ఈ కేసు లక్నోకి ట్రాన్సఫర్ చేయబడింది. సరైన విచారణ జరిగితే కానీ.. జరిగిన విషయం ఏమిటో బహిర్గతం కాదు" అని తెలిపారు.