తమ సంస్థ పరువు-ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా వ్యతిరేక, అసత్య వార్తా కథనాలు ప్రచురించిన కోబ్రా పోస్ట్‌పై పరువు నష్టం దావా వేస్తూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ జీ మీడియా కార్పొరేషల్ లిమిటెడ్ నోటీసులు జారీచేసింది. తమ సంస్థ విలువలను దిగజార్చేలా అసత్య కథనాలు ప్రచురించినందుకుగాను కోబ్రా పోస్ట్ బేషరతుగా క్షమాపణలు చెప్పి, ఆయా కథనాలను తొలగించాల్సిందిగా జీ మీడియా గ్రూప్ ఈ నోటీసుల్లో పేర్కొంది. లేనిపక్షంలో కోబ్రా పోస్ట్‌పై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టి చట్టరీత్యా న్యాయపోరాటం చేయనున్నట్టు జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్చరించింది. కోబ్రా పోస్ట్ సహా ది వైర్, ది క్వింట్, భదాస్4మీడియా సంస్థలకు సైతం జెడ్ఎంసీఎల్ ఇదే తరహాలో నోటీసులు జారీచేసింది. కోబ్రా పోస్ట్ కథనాల అనంతరం ఆ కథనాల్లో ఎంతమేరకు సత్యం ఉందనే తెలుసుకునే ప్రయత్నం కానీ లేదా తమ వివరణ కానీ తీసుకోకుండా ది వైర్ సంస్థ రెండు కథనాలను ప్రచురించడాన్ని తప్పుపడుతూ జీ మీడియా ఈ లీగల్ నోటీసులు జారీచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జర్నలిజం విలువలను పాటించకుండా నిబంధనలను అతిక్రమించి జీ మీడియా పరువు-ప్రతిష్టలకు భంగం కలిగేలా ది వైర్ ప్రచురించిన ఆ రెండు కథనాలను తొలగించడంతోపాటు, సదరు సంస్థ తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందిగా జీ మీడియా తమ నోటీసుల్లో పేర్కొంది. లేనిపక్షంలో ది వైర్ సంస్థపై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టడానికి వెనుకాడబోమని జీ మీడియా హెచ్చరించింది.


కోబ్రా పోస్ట్ కథనాలు ప్రచురించిన అనంతరం తమ వివరణ తీసుకోకుండా కోబ్రా పోస్ట్ కథనాలనే వల్లె వేసిన ది క్వింట్ మీడియా సంస్థకు సైతం జీ మీడియా నోటీసులు జారీచేసింది. జీ మీడియాకు వ్యతిరేకంగా ప్రచురించిన అసత్య కథనాలను తక్షణమే తొలగించి, బేషరతుగా క్షమాపణలు చెప్పని పక్షంలో చట్టపరమైన చర్యలకు పూనుకోనున్నట్టు జీ మీడియా గ్రూప్, 'ది క్వింట్‌'ని హెచ్చరించింది.