దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతడు ఎప్పుడొచ్చినా అనుకోకుండానే ఊడిపడుతాడు. కానీ వచ్చీ రావడంతోనే తన కబుర్లతో ఎప్పుడూ లేనంత సంతోష పెడుతాడు. ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు. తన బాధలేవీ ఎప్పుడూ చెప్పుకోడు. అలా ఓసారి చివరిసారిగా ఇంటికొచ్చినప్పుడు ఒకసారి అడిగాను.. ఎవరి ఇంటికైనా వెళ్లే పని ఉంటే చెప్పు నేను విడిచిపెడతాను అని. కానీ అందుకు అతడు చెప్పిన సమాధానం ఎక్కడికీ లేదని. ఇవాళ రేపు ఎవరికీ మనల్ని ఇంటికి పిలిచేంత సమయం లేదని అన్నాడు. అతడి మాటల్లో ఏదో లోతైన అర్థం ఉందని అనిపించింది. వెంటనే ఉండబట్టలేక అసలేం జరిగిందో చెప్పండని అడిగేశాను. 


అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టారు. "ఇక్కడ తనకు ఓ బాల్య స్నేహితుడు ఉన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా, మాట్లాడుకున్నా.. 'ఢిల్లీకి వస్తే తప్పకుండా కలవమని' తరచుగా చెబుతుండే వాడు. సరే అని ఓసారి ఇక్కడికొచ్చినప్పుడు వాడిని కలుద్దామని ఫోన్ చేశాను. కానీ అలా ఎప్పుడు ఫోన్ చేసినా ఇప్పుడు కాదు అప్పుడు, అప్పుడు కాదు ఇప్పుడు అన్నట్టుగా మాటలు దాటేయడమే తప్ప కలవడానికి ప్రయత్నించలేదు. ఈసారి ఫోన్ చేసినప్పుడు నేనేమన్నానంటే... బాగా ఆలస్యంగా వస్తే కుదరడం లేదు కనుక ఈసారి ఉదయం 8 గంటలకే వచ్చేస్తాను అని చెప్పాను. అందుకు అతడు ఇచ్చిన సమాధానం కుదరదు అని. సరే అయితే రాత్రి 8 గంటలకే వస్తాలే అన్నాను. అందుకు ఈసారి అతడి నుంచి ఒకింత అసహనంతో కూడిన సమాధానం వచ్చింది. 'అరే నువ్వు ఎంత చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవు ? ఇంటికి వచ్చేటప్పటికే రాత్రి ఆలస్యమైపోతుంది. కలవడం కుదరదని చెబుతున్నానా' అని నిక్కచ్చిగా చెప్పేశాడు. ఈసారి అతడు ఇచ్చిన సమాధానం ఏంటంటే.. 'ఢిల్లీలో ఒకరినొకరు కలవడం కుదరదనే కుదరదు... అంత సమయం కూడా ఉండదు. ఈసారి మీ ఊరికి వచ్చినప్పుడు నేనే కలుస్తాను' అని. అలా బాల్య స్నేహితులు, కాలేజీ మిత్రులను ఎవ్వరినీ కలవకుండానే వెళ్లిపోయాను'' అని ఆవేదన వ్యక్తంచేశారాయన.


ఇక్కడ అసలు ప్రశ్న వాళ్లు కలవకపోవడమో లేక కలవలేకపోవడం గురించో కాదు... మనం ఏదైతే చేయాలనుకుంటామో అది చెప్పలేం. ఏదైతే చెబుతామో దానిని చేయలేం. మనలో చాలామంది స్నేహితులు ఒకరికొకరు దూరంగా ఉండిపోవడానికి కారణం వాళ్లు ఒకరినొకరు కలుసుకోలేకపోవడం వల్ల కాదు... వాళ్లను కలవడానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే. 


అప్పుడప్పుడు స్నేహితులు ఒకరినొకరు కలుస్తుండటం అనేది ఒత్తిడిని దూరం చేసే థెరపీ లాంటిది. అందులో అనుబంధాల ఆక్సీజన్ ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకరి సాధకబాధకాలు మరొకరు పంచుకునే వీలుంటుంది. అందుకే స్నేహితులను కలవకుండా, వారికి దూరంగా ఉండకండి. అప్పుడే మానవత్వాన్ని కాపాడేందుకు బాటలు వేసినవాళ్లవుతారు. 


స్నేహితులను కలవకుండా ఎలా తప్పించుకోవాలా అనే కోణంలోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఒకరినొకరం కలుసుకోవడంలో ఉన్న పరమార్థాన్ని కూడా మరిచిపోతున్నాం. ఎవరితోనైతే పని పడుతుందో వాళ్లని మాత్రమే కలుస్తూ, వారినే స్నేహితులను చేసుకుంటాం కానీ వారి ధ్యాసలో పడి పాత స్నేహితులను పోగొట్టుకుంటున్నామనే చేదు నిజాన్ని గ్రహించడం లేదు. అలా ఒక్కసారి ఒకరి మధ్య దూరాలు పెరిగిపోతే, ఆ తర్వాత తిరిగి దగ్గరవడం అనేది కష్టం మాత్రమే కాదు.. అసంభవం కూడా అని తెలుసుకోవాలి. మొబైల్, వీడియో ఛాటింగ్ వంటివి వచ్చాకా ఒకరినొకరు కలవడం అనేది ఎందుకు చాలా వరకు తగ్గిపోయిందంటే, మనం కలిసిన ప్రతీసారి కేవలం ఏదో ఓ పని ఉంటే తప్ప.. మామూలుగా కలవడం కోసమైతే వెళ్లడం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, చాలా సందర్భాల్లో ఏదో ఓ వ్యాపారదృక్పథంతోనే ఒకరినొకరు వ్యాపారుల్లా కలుసుకుంటున్నారే తప్ప స్నేహితుల్లా సరదాగా మాత్రం కలుసుకోవడం లేదు. 


అందుకే పదే పదే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇంట్లోవాళ్లను, కుటుంబాన్ని, స్నేహితులను, అయిన వాళ్లను కలవడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని. ఇంట్లోకి వచ్చే గాలి కోసం ఇంటి తలుపులు తెరిచినట్టే, అయిన వాళ్లు, స్నేహితుల రాక కోసం కూడా అలాగే ద్వారాలు తెరిచి స్వాగతం పలకండి. 


కేవలం కలవడం కోసమే ప్రాధాన్యత ఇవ్వండి కానీ ఏదో ఓ పని కోసం కాదు. మనుషుల కోసం, మానవత్వం కోసం, చింతన కోసం, పరిశోధనలు వంటి వాటి కోసం కాకుండా ఇతరత్రా వాటి కోసం సమయాన్ని వెచ్చించే వాళ్ల దగ్గరే సమయం తక్కువ ఉంటుంది. అందుకే ఎవరైనా కలవడానికి తమ వద్ద సమయం లేదని చెబితే, వాళ్లకు అర్థమయ్యేలా, వాళ్ల పద్ధతిలోనే 'మీ సమయం అంతా ఎక్కడికెళ్తుంది ? ఏం చేస్తావు' అని కాస్త గట్టిగానే చెప్పాలి.  


సమయం గురించి చెబుతోంటే గుర్తొచ్చింది.. ప్రపంచం మెచ్చిన నాయకుడు నెల్సన్ మండేలా సమయం గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్నే చెప్పారు. నెల్సన్ మండేలా గారు ఓసారి తన స్నేహితుడికి ఓ పెద్ద లేఖ రాశారట. ఆ లేఖ చివరన ఏం రాశారంటే.. సమయం ఎక్కువగా లేదు. అందుకే లేఖ పెద్దదైపోయింది అని. వినడానికి విచిత్రంగా ఉంది కదూ..!! ఎందుకంటే చిన్న చిన్న విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడే ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. అలాకాకుండా చాలా విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు టకటకా చెప్పేస్తాం. 


నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, ఐన్‌స్టీన్ వంటి ప్రముఖులు అందరికీ అంత దగ్గరయ్యారంటే వారి వద్ద ఎప్పుడూ తీరిక సమయం ఉండేదని కాదు... కాకపోతే మానవ సంబంధాల పట్ల వాళ్లకున్న ప్రాధాన్యత, దూర దృష్టి వాళ్లకు సమయాన్ని సృష్టించేది. సమయం ఉండటానికి, సమయం లేకపోవడానికి మధ్య గల చిన్న తేడా అదే. 


మరి ఈ ఆదివారం ఎవరిని కలవడానికి వెళ్తున్నారు లేదంటే ఎవరిని ఇంటికి ఆహ్వానిస్తున్నారో చెప్పండి. "ఎప్పుడైనా వీలుంటే ఇంటికి రండి" అని మాత్రం ఎవ్వరికీ చెప్పకండి.. వీలున్నప్పుడో, వీలు చూసుకునో వాళ్లని మీరే ఆహ్వానించండి... వాళ్లతో కలిసి సరదాగా గడపండి.. అలా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. 


ఈ ఆర్టికల్‌ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి :- डियर जिंदगी : समय मिले तो घर आना कभी…


ఈ ఆర్టికల్‌ని కన్నడలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి :- ಡಿಯರ್ ಜಿಂದಗಿ: ಬಿಡುವಿದ್ದರೆ ಮನೆಗೆ ಬಂದು ಹೋಗಿ...


ఈ ఆర్టికల్‌ని గుజరాతిలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి :- ડિયર જિંદગી: સમય મળે તો ક્યારેક ઘરે આવજો...


सभी लेख पढ़ने के लिए क्लिक करें : डियर जिंदगी


(https://twitter.com/dayashankarmi)


(ఈ ఆర్టికల్‌పై మీ సలహాలు, సూచనలు తెలియచేయండి: https://www.facebook.com/dayashankar.mishra.54)