మెరిసిన అక్షర కిరణం సావిత్రీబాయి ఫూలే
మహారాష్ట్రలోని నైగాన్లో జనవరి 1831లో జన్మించిన సావిత్రీబాయికి 9వ యేట 12ఏళ్ల జ్యోతిరావు ఫూలేతో పెళ్ళైంది.
భారతదేశంలోని ప్రముఖ మహిళా సంఘ సంస్కర్తల్లో సావిత్రీబాయి ఫూలే ఒకరు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయిన సావిత్రీబాయి స్త్రీల విద్యాభివృద్ధి, హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి సావిత్రీబాయి 121వ వర్ధంతి నేడు.
* మహారాష్ట్రలోని నైగాన్లో జనవరి 1831లో జన్మించిన సావిత్రీబాయికి 9వ యేట 12ఏళ్ల జ్యోతిరావు ఫూలేతో పెళ్ళైంది. మహారాష్ట్రలో కుల, లింగ వివక్షపై ఈమె పోరాటం చేశారు.
* జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలయ్యారు. అహ్మద్‌నగర్‌లో ఉపాధ్యాయునిగా శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావుతో కలిసి భిన్న వర్గాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాలలో ఈమె తొలి టీచర్. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మారు సావిత్రీబాయి.
* భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి, 12 మే 1848 తేదిన దేశంలోని బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారు. దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు కూడా ఈవిడే. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. వారి జీవిత కాలంలో 52 పాఠశాలలు, పలు సంఘాలు స్థాపించారు.
* ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించి.. లింగ వివక్షలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం కృషిచేశారు.
* సావిత్రీబాయి ఫూలే సంఘ సంస్కర్తే కాదు, రచయిత్రిగా కూడా ప్రసిద్ధి చెందారు. 1854లోనే ఆమె తన కవితా సంపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించారు. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభోధ్ రత్నాకర్’ను 1891లో ప్రచురించారు. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి.
* దత్తపుత్రుడు యశ్వంత్‌తో కలిసి పూణే శివారులో ఓ చికిత్సాలయం ప్రారంభించారు. రోగులకు వైద్య సేవలందిస్తూ.. అనారోగ్యానికి గురై 10 మార్చి 1897లో కన్నుమూశారు.