మానవీయతకు నిలువెత్తు రూపంగా నిలిచి జీవన పోరాటం చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి ఆయన. శరీరం మొత్తం చచ్చుబడిపోయి.. చక్రాల కుర్చీకే పరిమితమైనా శాస్త్రపరిశోధనలో ఏదో సాధించాలని అహర్నిశలు తపిస్తూ.. మేధోమదనం చేస్తున్న చైతన్యధీరుడు ఆయన. ప్రపంచ చరిత్రలో నేడు స్టీఫెన్ హాకింగ్ నిజంగానే ఓ స్ఫూర్తిప్రదాత. ఆయన జన్మదినం సందర్భంగా హాకింగ్ జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*1942 జనవరి 8 తేదిన ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు స్టీఫెన్ హాకింగ్.  భౌతిక శాస్త్రంలో డిగ్రీ అందుకున్న హాకింగ్ 1962లో కాస్మాలజి, జనరల్ రిలేటివిటీ అనే అంశాలపై పరిశోధనలు చేయడం కోసం ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్ళారు. అప్పుడే ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. నాడీ మండలంతో పాటు వెన్నుపూసను కూడా ప్రభావితం చేసే ఈ వ్యాధి వలనే ఆ శరీరం పూర్తిగా నిస్తేజమైంది. ఆయన ఎంతోకాలం బతకరని భావించారు వైద్యులు.


*కానీ హాకింగ్ ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓటమి పాలైంది. శరీరం సహకరించకపోయినా.. చక్రాల కుర్చీలకే పరిమితమైనా హాకింగ్ తన పరిశోధనలు ఆపలేదు. 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' అనే గొప్ప రచనకు ఆయన శ్రీకారం చుట్టారు. అలాగే డిజిటల్ పరికరాల సహాయంతో మాట్లాడే యంత్రాన్ని కూడా ఆయన కనుగొన్నారు. అదే స్పీచ్ జెనరేటింగ్ పరికరం ద్వారా నేడు ఆయన తన భావాలను ఎదుటివారితో పంచుకుంటున్నారు.


*న్యూక్లియర్ ఆయుధాల వల్ల ఈ భూమండలానికి కలిగే నష్టం అంతా ఇంతా కాదని చెబుతూ.. దాని చెడు ప్రభావం మానవాళికి ఎలాంటి ఉపద్రవాలు తీసుకొస్తుందో తెలిపిన గొప్ప మానవతావాది హాకింగ్.


*హాకింగ్ న్యూరాన్ వ్యాధి బారిన పడకముందే ఆయనకు పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. ఆ వ్యాధికి మందులేదని.. హాకింగ్ బ్రతికి ఉపయోగం లేదని డాక్టర్లు చెప్పినప్పుడు , హాకింగ్ భార్య జేన్ తన భర్తవైపే నిలిచారు. ఆయనను కంటిపాపలా కాపాడుకున్నారు. ఆయన పరిశోధనల్లో ఆమె కూడా తన సహకారాన్ని అందించారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆమె హాకింగ్‌కి విడాకులు ఇవ్వడం గమనార్హం.


*హాకింగ్ ఒక్క నోబెల్ పురస్కారం తప్ప, ప్రపంచంలోని దాదాపు శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన అన్ని పురస్కారాలనూ పొందారు. ఆడమ్స్ ప్రైజ్ (1966), ఎడ్డింగ్టన్ మెడల్ (1975), మాక్స్‌వెల్ మెడల్ (1976), ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అవార్డు (1978), వుల్ఫ్ ప్రైజ్ (1988), ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ (2009), ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్ (2012) అందులో ప్రముఖమైనవి


*1971 సంవత్సరం నుండీ బిగ్‌బ్యాంగ్ థియరీ పై పరిశోధనలు మొదలు పెట్టిన హాకింగ్, కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో తెలియని విషయాలను ఆవిష్కరించారు. 


*స్టీఫెన్ హాకింగ్ తను మాట్లాడలేరు కాబట్టి.. ఒక ప్రత్యేకమైన స్పెల్లింగ్‌ కార్డ్‌ మీదున్న అక్షరాల్ని తన కనుబొమల కదలికల ద్వారా ఎంపిక చేసేవారు. తర్వాత 1986లో 'ఈక్వలైజర్‌' కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ వచ్చాక ఆ పద్ధతి సులువైంది


*వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనల్లో దేవుడి ప్రమేయమే లేదని తేల్చి చెప్పిన శాస్త్రవేత్త హాకింగ్. అయినా నాస్తికత్వంపై పలు విమర్శలు ఉన్నా.. తన సిద్ధాంతాలతో వాటిని పటాపంచలు చేసిన మేధావి హాకింగ్ 


*బ్రూస్ అలెన్, బెర్నార్డ్ కెర్, గ్యారీ గిబ్బన్స్, థామస్ హెర్టాగ్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలందరూ హాకింగ్ రచనలపై పరిశోధనలు చేసి డాక్టరేట్లు పొందినవారే. 


*హాకింగ్ జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తూ 2014లో "థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్" అనే సినిమా కూడా విడుదలైంది. అందులో హాకింగ్ పాత్రను హాలీవుడ్ నటుడు ఎడ్డీ రెడ్మేన్ పోషించారు. 


49 ఏళ్లుగా మరణం తనకు చాలా సమీపంలో ఉన్నప్పటికీ... ఆత్మస్థైర్యంతో, అకుంఠిత దీక్షతో దానిని జయించిన మేటి శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అనడంలో సందేహం లేదు. ఆయన కథ శాస్త్ర సాంకేతిక రంగంలోనే ఒక చారిత్రక విప్లవం అనడం అతిశయోక్తి కాదు.