Cars and Bikes Gift to Employees: ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. ఏకంగా 28 కార్లు, 29 బైక్‌లు గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ
చెన్నైలోని సెమ్మంచేరి, నవలూరులో దసరా సందర్భంగా ఓ స్టీల్ ప్రైవేట్ కంపెనీ ఆయుధపూజ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ పూజా క్రమంలో కంపెనీ యజమాని శ్రీధర్ కన్నన్ ఉద్యోగులకు కారు, బైక్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.
కంపెనీలో 9 ఏళ్లకు పైగా పనిచేస్తున్న 28 మంది ఉద్యోగులకు కారు, 7 ఏళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులకు 29 బైక్‌లు ఇచ్చారు. ఆయుధపూజ అంటూ ఉద్యోగులను కుటుంబ సమేతంగా ఆఫీసుకు రమ్మని కంపెనీ యజమాన్యం చెప్పింది. ఆయుధ పూజ అనంతరం కార్లు, బైక్‌లతో అందరినీ సంతోషపరిచారు.
ఈ సందర్భంగా కంపెనీ ఓనర్ శ్రీధర్ కన్నన్ మాట్లాడుతూ.. 2005లో కేవలం నలుగురితో ప్రారంభమైన తమ సంస్థ ఇప్పుడు 180 మంది ఉద్యోగులతో సెమ్మంజేరి, నవలూరులో రెండు కంపెనీలుగా ఎదిగిందని చెప్పారు.
గత 10 ఏళ్లుగా తమ సంస్థలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఉద్యోగులకు కారు, 7 ఏళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులకు బైక్‌ను అందజేశామన్నారు.
గత కొన్నేళ్లుగా ఉద్యోగులకు బహుమతులు ఇస్తున్నామని.. ఇది ఇలాగే కొనసాగుతుందన్నారు. కారు లేని వారికి ఈ బహుమతి ఎంతో ఉపయోగపడుతుందని.. రూ.3.5 కోట్ల విలువైన బహుమతులను అందించినట్లు చెప్పారు.