Telangana: భాగ్యనగరంలో యథేచ్ఛగా కోవిడ్ నిబంధనల ఉల్లంఘన
హైదరాబాద్ మార్కెట్ల పరిసరాల్లో ప్రజలు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుతుండటంతోనే.. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల హాడావుడి మొదలైంది. ఓ ప్రచారం.. మరో వైపు కోవిడ్ నిబంధనల ఉల్లంఘన వల్ల కేసుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇదిలాఉంటే... రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1058 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు (4) మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,60,834 కి చేరగా.. మరణాల సంఖ్య 1,419 కి పెరిగింది. ఇప్పటివరకు 2,46,733 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,682 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అయితే నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 168 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి బుధవారం నాటి ఫొటోలను వార్త సంస్థ ఎఎన్ఐ (ANI) ట్విట్టర్‌లో పంచుకుంది.
హైదరాబాద్ పరిసరాల్లో ఇలా మాస్కులు లేకుండా ప్రజలు తిరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ఇప్పటికైనా ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని వేడుకుంటున్నారు.