Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరం..
Tirumala Laddu: ఇప్పటికే శ్రీవారి ఆలయం పోటులో విచారణ చేపట్టింది సిట్. లడ్డూ తయారీకి సంబంధించిన కీలక వివరాలను సేకరించే పనిలో పడింది. ఇందుకోసం వినియోగించే నెయ్యి నాణ్యత గురించి విచారణ బృందం అడిగి తెలుసుకుంది.
రోజూ ఎంత నెయ్యి వినియోగిస్తారు. ఎక్కడ నుంచి తీసుకొస్తారంటూ ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే పిండి మరను పరిశీలించింది. అదే విధంగా ఆహార ఉత్పత్తుల నిల్వ ప్రదేశం, పరిశోధన శాలను సిట్ బృందం తనిఖీ చేసింది. మరోవైపు ఇప్పటికే ఏఆర్ డెయిరీతో పాటు వైష్ణవి డెయిరీలను సిట్ అధికారులు పరిశీలించారు.
టీటీడీకి నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే నేరుగా సరఫరా చేసిందా? లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా? అనేది పరిశీలన చేస్తోంది. టెండర్ సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలు ఏమిటి? ఆయా సంస్థల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాలను బేరీజు వేస్తున్నాను.
నెయ్యి సరఫరాకు ఆయా సంస్థలకు ఏ మేరకు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పుడు ఎంత ఉందని తమ పరిశీలనలో తేలిందో అధికారులు సరిచూశారు.
తమిళనాడులోని దుండిగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ, శ్రీకాళహస్తి ప్రాంతంలోని వైష్ణవి డెయిరీలతోపాటు చెన్నైలోని ఎస్‌ఎంఎస్ ల్యాబ్ నుంచి స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సిట్‌లోని 2 బృందాలు తిరుపతిలోని కార్యాలయంలో వీటిని నిశితంగా పరిశీలించాయి.
టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డెయిరీకి లేదని, ఈ డెయిరీ నిర్వాహకులు 2 ఇతర డెయిరీల నుంచి నెయ్యి సేకరించి టీటీడీకి సరఫరా చేసినట్లు అదీ నాణ్యతా లోపంగా ఉందని సిట్ నిర్ధారించినట్లు సమాచారం.