Bear Climbed on Tree: జనావాసాల్లో ఎలుగుబంటి హల్చల్
Bear Climbed on Tree: సిద్ధవటం ప్రధాన రహదారి గ్రామచావిడి వద్ద తెల్లవారుజామున అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి వచ్చిన ఎలుగు బంటి జన సంచారాన్ని చూసి చెట్టు ఎక్కి చిటారు కొమ్మలోకి వెళ్లి కూర్చుంది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి ఆధ్వర్యంలో ఎలుగుబంటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో తరలించడానికి ఏర్పాట్లు చేపట్టారు.
Bear Climbed on Tree: కడప జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. జనవాసాల్లో ప్రత్యక్షమైన ఎలుగుబంటి.. జనం రద్దీగా ఉండటంతో గ్రామంలోనే రహదారిని ఆనుకుని ఉన్న పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంది. చెట్టు ఎక్కి కూర్చున్న ఎలుగుబంటిని చూసి స్థానికులు, అక్కడి రహదారి గుండా వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎలుగు బంటిని సురక్షితంగా కాపాడేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
సిద్ధవటం ప్రధాన రహదారి గ్రామచావిడి వద్ద తెల్లవారుజామున అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి వచ్చిన ఎలుగు బంటి జన సంచారాన్ని చూసి చెట్టు ఎక్కి చిటారు కొమ్మలోకి వెళ్లి కూర్చుంది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి ఆధ్వర్యంలో ఎలుగుబంటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో తరలించడానికి ఏర్పాట్లు చేపట్టారు. పోలీస్ శాఖ అనుమతి తీసుకొని ప్రజలు ఎవ్వరూ అటు ప్రాంతానికి రాకుండా గట్టి చర్యలు తీసుకుని మరీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
బుధవారం తెల్లవారుజాము నుండి రాత్రి చీకటి పడే వేళ వరకు ఎలుగుబంటి చెట్టుపై నుంచి ఎంతకీ కిందకు దిగలేదు. రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. రెస్క్యూ టీమ్ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ వృథా అయ్యాయి. గ్రామంలో వీధి దీపాలను ఆర్పి వేసి మరీ తమ ప్రయత్నాలు కొనసాగించారు. ఎలుగుబంటి చెట్టు దిగి గ్రామంలోకి వెళ్తే.. గ్రామస్తులపై దాడి చేసే ప్రమాదం ఉందన్న ముందస్తు జాగ్రత్తలతో ఇళ్ళలో నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.
ఒకవేళ రెస్క్యూ టీమ్ చేసే ప్రయత్నాలు ఫలించకపోతే ఉదయాన్నే మరోసారి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఎలుగుబంటిని సురక్షితంగా పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనేందుకు తిరుపతి నుంచి డాక్టర్ సత్య ప్రకాష్, అరుణ్ బృందం సిద్ధవటం చేరుకుంది. సాయంత్రం 6:30 నుండి 7:00 వరకు ట్రాఫిక్ పూర్తిగా నిలిపేసి ఎలుగు బంటిని కిందికి దింపేందుకు ఏర్పాట్లు చేసినా ఫలితం శూన్యమే అయింది.