హ్యాకింగ్.. ఇది నేడు కంప్యూటర్ యూజర్లకు చాలా ప్రధానమైన సమస్య. మామూలు భాషలో చెప్పాలంటే.. హ్యాకింగ్ అంటే హైజాకింగ్ చేయడం లాంటిదే. మన అనుమతి లేకుండా మన సిస్టమ్‌లోకి చొచ్చుకువచ్చి.. అనైతికమైన పనులను చేయడమే హ్యాకింగ్. నేడు ప్రతీ సంవత్సరం కొన్ని వేల కంప్యూటర్లు, వెబ్ సైట్లు హ్యాకింగ్ బారిన పడుతున్నాయి. ఒకసారి అలా మన సిస్టమ్‌ను హ్యాక్ చేశాక, అందులోని డేటాకి ఎలాంటి హాని చేయకుండా మనకు సురక్షితంగా అప్పగించడానికి హ్యాకర్లు కొంత డబ్బు డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఒక రకంగా, కిడ్నాప్ చేసి డబ్బు గుంజడం లాంటిదన్న మాట. అయితే సిస్టమ్ మొత్తం హ్యాకింగ్ చేసే వారి కంట్రోల్‌‌లో ఉంటుంది కాబట్టి.. మనకు నిజాయతీగా డేటా మొత్తం అప్పగిస్తారని కూడా చెప్పలేం.


  • సాధారణంగా హ్యాకర్లు ముందుగా ఒక కంప్యూటర్ నెట్వర్క్‌ను టార్గెట్ చేసుకొని పని మొదలుపెడతారు. KALI LINUX, VM PLAYER, RASPERRY Pi లాంటి హ్యాకింగ్ టూల్స్ సహాయంతో ఆయా కంప్యూటర్ నెట్‌వర్క్‌లోకి ఎలా ఎంటర్ అవ్వాలన్న దానిపై ఒక ప్రణాళిక కూడా వేసుకుంటారు హ్యాకర్లు.


  • ఆ నెట్‌వర్క్‌కు సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయేమో కూడా చూస్తారు. ఒకవేళ వెబ్‌సైట్ లేదా కంప్యూటర్ నెట్‌వర్క్ సిస్టమ్ ఎటువంటి సెక్యూరిటీ పర్మిషన్లు లేదా ప్రైవసీ లేకుండా పనిచేస్తున్నప్పుడు ఈ హ్యాకర్ల పని ఇంకా ఈజీ అవుతుంది.


  • చాలామంది హ్యాకర్లు మాల్వేర్ ఉన్న లింకులు, ఈమెయిల్స్ పంపించడం ద్వారా కూడా మన నెట్‌వర్క్‌లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తుంటారు.


  • సాధారణంగా క్రిమినల్ మైండ్ సెట్‌తో ఆలోచించి ఒక కంప్యూటర్ సిస్టమ్‌‌లోకి అనైతికంగా ప్రవేశించి డేటా దొంగలించే ప్రయత్నం చేసేవారిని 'బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్' అంటారు. 


  • ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవారు కార్పొరేట్ డేటాని కొల్లగొట్టడంతో పాటు, పలు సేవలను యూజర్స్‌కి అందకుండా చేయడం, సిస్టమ్‌ను స్తంబింపజేయడం వంటి పనులు చేస్తారు.


  • అయితే ఈ హ్యాకర్లకు దీటైన సవాలు విసరడానికి ఎథికల్ హాకర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి చాలా కంపెనీలు.


  • ఒక కంపెనీ కంప్యూటర్ సిస్టమ్‌లో ఉండే లోపాలు తెలుసుకోవడానికి, వాటిని సవరించడానికి.. కావాలనే తమ సిస్టమ్స్‌ను కొన్ని నిబంధనలను అనుగుణంగా హ్యాకింగ్ చేసే అవకాశం కల్పిస్తారు.


  • ఎథికల్ హ్యాకర్ల వల్ల తమ సిస్టమ్స్‌లో ఎలాంటి లోపాలు ఉన్నాయో అన్న అంశంతో పాటు వాటిని ఎలా పరిష్కరించాలన్న అంశంపై కార్పొరేట్ కంపెనీలకు ఒక అవగాహన వస్తుంది. 


  • నేడు హ్యాకింగ్ ఎంత అడ్వాన్స్డ్‌గా మారిందంటే.. పలు యాప్స్ ద్వారా కూడా ఈ హ్యాకర్లు వినియోగదారుల డేటాను తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. 


  • అలాగే వినియోగదారులు కూడా ఒరిజినల్ లైసెన్స్ వాడకుండా ఇంటర్నెట్‌లో దొరికే క్రాక్డ్ సాఫ్ట్‌వేర్లు వాడటం వల్ల కూడా హ్యాకర్లు సులువుగా సిస్టమ్ హ్యాక్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు.