Happy Pongal 2023, Jallikattu 2023: జల్లికట్టు.. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలు ఎలాగో తమిళనాడులో జల్లికట్టు క్రీడ అలాగ. జల్లికట్టులో పాల్గొనేవారు రంకెలేస్తూ దూసుకొస్తున్న ఎద్దును వీలైనంత ఎక్కువ సేపు పట్టుకుని, దానిని నియంత్రించేందుకు ప్రయత్నించాలి. ఇదొక సాహసోపేతమైన క్రీడ. గతంలో ఎక్కడపడితే అక్కడ జల్లికట్టు పోటీలు జరుగుతుండేవి. కానీ జల్లికట్టు పేరుతో జంతువులని హింసిస్తున్నారంటూ జంతు ప్రేమికులు కోర్టుకు వెళ్లడంతో జల్లికట్టు క్రీడపై కోర్టులు ఆంక్షలు విధించాయి. అలా ఈ ఏడాది అధికారికంగా తమిళనాడులోని మధురై జిల్లాలో మూడు గ్రామాల్లో మాత్రమే జల్లికట్టు క్రీడకు అనుమతి ఉందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జల్లికట్టుకు ఆ పేరెలా వచ్చిందంటే..
జల్లికట్టు అనేది రెండు పదాల కలయిక. అందులో మొదటి పదమైన జల్లి అసలి పేరు సల్లి... అంటే నాణేలు అని అర్థం. ఇక రెండో పదమైన కట్టు అంటే ఒక చిన్న మూట అని అర్థం. జల్లికట్టు క్రీడ ఆరంభమైన కొత్తలో ఎద్దు కొమ్ములకు నాణేలు ఉన్న చిన్న మూటను కట్టే వారు. జల్లికట్టులో పాల్గొనే వారు ఎద్దు కొమ్ములను పట్టుకుని నియంత్రిస్తూ ఆ  మూటను సొంతం చేసుకోవాలి. అలా చేసిన వారే జల్లికట్టు క్రీడలో గెలిచినట్టుగా ప్రకటించే వారు. ఇది జల్లికట్టు క్రీడ నేపథ్యం. 


జల్లికట్టు చరిత్ర, ప్రాముఖ్యత
తమిళనాడులో జల్లికట్టు క్రీడ అనేది క్రీస్తుపూర్వం 400 నుండి 100 మధ్య యుగంలోనే ఉద్భవించిందని చరిత్ర చెబుతోది. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలోనూ సింధు లోయ నాగరికత కాలం నుంచే ఈ ఆచారాన్ని వర్ణించే ముద్ర ఉండటం గమనార్హం. అంతేకాకుండా మదురైలోని ఒక గుహలో ఒక వ్యక్తి ఒక ఎద్దును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్న పెయింటింగ్ చెక్కి ఉంది. ఈ శిల్పం కూడా సుమారు 1,500 సంవత్సరాల నాటిదని పురాతత్వ శాస్త్రవేత్తల అంచనాలు చెబుతున్నాయి.


జల్లికట్టును తమిళంలో ఏరు తాజువుతాల్ లేదా మంచువిరాట్టు అనే పేర్లతో కూడా పిలుస్తారు. జల్లికట్టు క్రీడ కోసం సిద్ధం చేసే ఎద్దులకు కూడా ఈ క్రీడపై ట్రెయినింగ్ ఉంటుంది. దానినే మన్ కుతాల్ అంటారు. ఎద్దుల చేత నీటితో తడిపిన భూమిలో కొమ్ములను తవ్వడం ద్వారా వాటి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి శిక్షణ ఇస్తారు. ఈ ట్రెయినింగ్ తరువాత ఎవరైనా తమ మూపురం పట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. వెంటనే ఎద్దులు దాడి చేయడానికి సిద్ధంగా ఉండేలా జల్లికట్టు ట్రెయినింగ్ జరుగుతుంది.


ఆవుల పెంపకం ఒక కృత్రిమ ప్రక్రియగా మారడంతో, ఎద్దులను వ్యవసాయం, మాంసం కోసం ఉపయోగించే దుస్థితి నెలకొన్న తరుణంలో జల్లికట్టు క్రీడ అనేది ఒక రకంగా దేశవాళీ జాతి ఎద్దులను సంరక్షించేందుకు రైతులకు ఒక అవకాశాన్ని కల్పిస్తోంది. 


జల్లికట్టు 2023 తేదీ వివరాలు..
తమిళనాడులో ఈ ఏడాది మధురై జిల్లాలో జనవరి 15 నుంచి 17 వరకు జల్లికట్టు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మూడు గ్రామాల్లో ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు. అందులో ఒకటి అవనియాపురం, రెండు పాలమేడు కాగా మూడోది అలంగనల్లూరు. ఈ మూడు ప్రాంతాల్లో, మూడు వేర్వేరు తేదీల్లో జల్లికట్టు క్రీడ జరుగుతుంది. జనవరి 15న అవనియాపురంలో, జనవరి 16న పాలమేడులో, జనవరి 17న అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు జరగనున్నాయి.


జల్లికట్టు 2023 వేదికలు..
మదురై పట్టణానికి అవనియాపురం 6 కి.మీ దూరం ఉండగా, మధురై నుండి పాలమేడు సుమారు 22 కి.మీ దూరంలో ఉంటుంది. పాలమేడు ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ జల్లికట్టు పోటీలు వీక్షించడానికి వీలుగా పెద్ద గ్యాలరీని నిర్మించారు. అలంగనల్లూరు ప్రాంతం మధురై నుండి 15-16 కి.మీ దూరంలో ఉంది. అవనియాపురం, పాలమేడు కంటే అలంగనల్లూరులోనే జల్లికట్టు పోటీలను వీక్షించడానికి జనం భారీ సంఖ్యలో పోటీపడుతుంటారు. జల్లికట్టు పోటీలకు ఇదంతా నాణేనికి ఒకవైపు లాంటి కథ మాత్రమే.. జల్లికట్టు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన అంశాలు ఇంకెన్నో ఉన్నాయి. అవన్నీ మరో కథనంలో మీ ముందుకు తీసుకొస్తాం.