Ugadi Festival 2024: ఉగాది రోజు సూర్యోదయ కాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయి. వసంత రుతువు మొదలయ్యేది ఈ రోజే.  బీడుపడిన భూములు మొలకలెత్తి ప్రకృతి పచ్చగా మారే కాలం. పచ్చని పంటపొలాలు, వాటిపైన చెట్లు, రంగు రంగుల పూలు సౌభాగ్యానికి చిహ్నలుగా కనువిందు చేస్తాయి. వీటన్నింటితో పాటూ ఉగాది రోజు చేసే ఉగాది పచ్చడి ప్రత్యేకమైనది.ఉగాది పర్వదినంనాడు తప్పనిసరిగా తినాల్సిన ఆహారం ఉగాది పచ్చడి. మన శాస్త్రాలలో ఉగాది పచ్చడిని నింబ కుసుమ భక్షణం, అశోకకళికా ప్రాశనం అని పిలుస్తారు.  షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడికి ఓ ప్రత్యేకత ఉంది. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి మనిషి జీవితానికి అవసరమైన ఓ ముఖ్య సందేశాన్ని అందిస్తుంది. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలని చెబుతుంది ఉగాది పచ్చడి.  అంతేకాదు ఋతువు మార్పు కారణంగా వచ్చే రోగాలను నివారించే ఔషద లక్షణం ఉగాది పచ్చడిలో ఉంటుంది. అందుకే ఉగాది రోజు పచ్చడి తినాలని ఆచారంగా పెట్టారు మన పూర్వీకులు.  ఈ రోజు ప్రతి ఇల్లు పచ్చని తోరణాలతో ఆహ్వానం పలుకుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగాది పండుగలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి. మానవ జీవితమంటే అనేక రకాల సమ్మేళనం. పచ్చడిలో ఉండే విధంగానే జీవితంలోనూ కష్టలు, సుఖాలుంటాయని తెలియజెప్పేదే ఉగాది పచ్చడి. ఒక్కరోజు ఒక్కపూట మాత్రమే ఉగాది పచ్చడి తింటే సరిపోదు. పూర్వకాలంలో కొన్ని రోజుల పాటు ఈ పచ్చడి క్రమం తప్పకుండా తాగేవారు. అప్పట్లో పచ్చడి చేసే విధానంలో కూడా తేడాలుండేవి. ప్రస్తుతం అది ఒక్కరోజుకు మాత్రమే పరిమితం అయ్యింది.


ఉగాది పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్లు.. అశోక చెట్ల చిగుళ్ల, కొత్త బెల్లం, వేపపూత, మామిడికాయ ముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి వాడతారు. ఇది శారీరక ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాదు, ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదంటారు. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి తోడ్పడుతుందని డాక్టర్లు చెబుతారు. అయితే ఒక్కపూట లేదా ఒక్క రోజు మాత్రమే ఈ పచ్చడిని తింటే సరిపోదు. అందుకే పూర్వకాలంలో ఈ వేపపూత పచ్చడిని చైత్రశుక్ల పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుంచి తొమ్మిది రోజుల పాటూ అంటే వసంత నవరాత్రుల వరకైనా తాగేవారు. దీనివల్ల సంవత్సర కాలంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు దరిచేరవు అనేది ప్రజల విశ్వాసం. పూర్వకాలంలో లేత వేప చిగుళ్లతో ఇంగువ పొంగించి బెల్లం కలిపి కొద్దిగా నూరి, చింతపండు, తాటిబెల్లం లేదా పటికబెల్లం, జీలకర్ర, మంచి పసుపు కలిపి చేసేవారు. ఇప్పుడీ పద్దతి కనిపించడం లేదు.



షడ్రుచులు... జీవితపు పరమార్థాలు. సుఖదు:ఖాలు, సంతోషవిషాదాలు, కోపతాపాలు.. ఇవన్నీ మన జీవితాన్ని నిర్థేశిస్తాయి. వీటిల్లో ఏది ఎక్కువా, తక్కువా అయినా జీవితం అర్థం లేకుండా గడుస్తుంది. అలా కాకుండా జీవితంలో అన్నింటిని సమభాగం చూపించేదే ఉగాది పచ్చడి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం, ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. ఉగాది పచ్చడి షడ్రుచుల్లో ఒక్కొ రుచికి ఒక్కొక్క అర్థాన్ని తెలుపుతుంది. తీపి సుఖానికి, కారం కష్టానికి, పులుపు దు:ఖానికి, వగరు విచారానికి, చేదు నష్టానికి, ఉప్పు విధేయతకు చిహ్నాలుగా చెబుతారు. ఇక వీటిలోని ఆరోగ్య లక్షణాలను చూస్తే.. తీపికి ప్రతిరూపమైన చెరకు లేదా బెల్లంలో శరీరంలోని వాతాన్ని హారించే గుణం ఉంది. సంవత్సరంలో ఒక్కసారైనా బెల్లంతో చేసిన వంటకాలు తినాలంటారు. వగరు కోసం వాడే పచ్చిమామిడికాయ జీర్ణశక్తిని పెంపొందింస్తుంది. కడుపులో ఉండే జఠర రసాన్ని వృద్ధి చేస్తుంది. చేదు కోసం వేపపువ్వును వాడతాం. ఈ వేపపువ్వులో ఉండే గుణాలు క్రిమి సంహారిణిగా, పైత్య నివారిణిగా పనిచేస్తుంది. ఈ చేదు చర్మ సంబంధమైన రోగాల నివారణకు కూడా పనిచేస్తుంది. పులుపుకోసం వాడే కొత్త చింతపండు రసంలో వాతం, శ్లేషం తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పులుపులో ఉండే విటమిన్, శరీరంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. తగిన మోతాదులో వాడితే ఉప్పు కూడా దివ్యౌషదమే. ఈ ఉప్పు ఆహారం తొందరగా జీర్ణం కావడానికి పైత్య నివారణకు ఉపయోగపడుతుంది. ఉప్పులో ఉండే సోడియం రక్తంలో తొందరగా కలుస్తుంది. ఆరోది కారం. ఇది ఉబ్బు లక్షణాలను, కంఠరోగాలను తగ్గిస్తుంది. నేత్రరోగాలను దరిచేరనీయదు. ఒక్కో రుచి వెనుకా.. దానికి వాడే పదర్ధాల వెనకున్న పరమార్దం ఇదే. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని అక్షర సత్యంగా పాటించడమే ఉగాది పచ్చడి అర్థం పరమార్థం.


Also Read: Pawan Kalyan: జగన్‌లాంటి 'కోడిగుడ్డు' ప్రభుత్వం ఇంకా కావాలా? పవన్‌ కల్యాణ్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook