వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగవ వన్డేలో రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో రికార్డుల మీద రికార్డులు బద్దలుకొట్టాడు. అందులో ఒకటి అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 21వ సెంచరీ చేసిన ఆటగాళ్ళ సరసన చేరడం. 98 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. ఈ ఘనతను సాధించాడు. ఈ జాబితాలో ఇప్పటికే ఆమ్లా (116 ఇన్నింగ్స్), కోహ్లీ (138 ఇన్నింగ్స్), డివిలియర్స్ (183 ఇన్నింగ్స్) ఉన్నారు. వారి తర్వాత స్థానంలో రోహిత్ (186 ఇన్నింగ్స్) ఉన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 19 సెంచరీలు సాధించిన వారి జాబితాలో కూడా చేరాడు. 102 ఇన్నింగ్స్‌లలో హషీమ్ ఆమ్లా ఆ రికార్డు నమోదు చేయగా.. 107 ఇన్నింగ్స్‌లలోనే రోహిత్ 19 సెంచరీల రికార్డును నమోదు చేశాడు.  అంటే ఆమ్లా తర్వాత ఆ ఘనత సాధించిన రెండవ వ్యక్తి రోహిత్ ఒక్కడే అన్నమాట. తన తర్వాత మూడవ స్థానంలో 115 ఇన్నింగ్స్‌లో రికార్డు నమోదు చేసిన సచిన్ ఉండడం విశేషం. ఇక 2013 సంవత్సరం నుండీ వన్డేలలో ఎక్కువ శతకాలు సాధించిన వారిలో రోహిత్ రెండవ స్థానంలో ఉండడం విశేషం.


25 సెంచరీలతో కోహ్లీ తొలి స్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో రోహిత్ రెండవ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఈ రోజు రోహిత్, రాయుడు ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీరి జోరు వల్ల 40 ఓవర్లకే టీమిండియా 250  పరుగులు దాటేసింది. ముఖ్యంగా రోహిత్ శర్మ తన డబుల్ సెంచరీ కూడా పూర్తి చేస్తాడు అనుకున్నారు అభిమానులు. కానీ 20 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 162 పరుగులు చేసి.. నర్స్ బౌలింగులో అవుటయ్యాడు రోహిత్. అప్పటికే భారత్ స్కోరు 44 ఓవర్లకు 313 పరుగులు దాటడం విశేషం.