Australia Beat India in 1st ODI: భారత్‌పై శతక్కొట్టిన వార్నర్, ఫించ్.. ఆసీస్ ఘన విజయం
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (128; 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్), ఆరోన్ ఫించ్ (110; 114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్) శతకాలతో చెలరేగడంతో కేవలం 37.4 ఓవర్లలోనే ఆ జట్టు సునాయసంగా గెలుపొందింది.
ముంబై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (128; 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్), ఆరోన్ ఫించ్ (110; 114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్) శతకాలతో చెలరేగడంతో కేవలం 37.4 ఓవర్లలోనే ఆ జట్టు సునాయసంగా గెలుపొందింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 255పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్, కేన్ రిచర్డ్ సన్ చెరో రెండు వికెట్లు తీశారు.
Also Read: భారత్‌తో తొలి వన్డే: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు 5వ ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (10)ని మిచెల్ స్టార్క్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకొచ్చిన రాహుల్ (47; 61 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి శిఖర్ ధావన్ (74; 91 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో ధావన్ 66 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ భాగస్వామ్యం(121 పరుగులు) తర్వాత హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో రాహుల్‌ను అష్టన్ అగర్ ఔట్ చేశాడు. మరో ఆరు పరుగుల తర్వాత పాట్ కమిన్స్ బౌలింగ్ లో షాట్ ఆడేందుకు యత్నించిన ధావన్ అష్టర్ అగర్ క్యాచ్‌కు పెవిలియన్ బాట పట్టాడు.
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఓ స్థానం కిందకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (16) ఓ సిక్స్ కొట్టి పరవాలేదనిపించాడు. అయితే జంపా బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. ఆ తర్వాతి ఆటగాళ్లలో కేవలం రిషభ్ పంత్(28; 33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా(25; 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పరవాలేదనిపించారు. చివర్లో కుల్దీప్ (17; 15 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ స్కోరు 250 దాటింది. మహ్మద్ షమీ (10)ని కేన్ రిచర్డ్ సన్ ఔట్ చేయడంతో 49.1ఓవర్లలో భారత్ 255 పరుగుల వద్ద ఆలౌటైంది.
256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగవంతంగా (115వ ఇన్నింగ్స్‌ల్లో) 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యంత వేగంగా ఈ పీట్ సాధించిన ఆటగాళ్లల్లో నాలుగో స్థానంలో నిలిచాడు వార్నర్. దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా కేవలం 101 ఇన్నింగ్స్‌ల్లో 5వేల వన్డే పరుగుల మార్క్ చేరుకోవడం విశేషం. విండీస్ దిగ్గజం వీవ్ రిచర్డ్స్ (114 ఇన్నింగ్స్), ఛేజింగ్ మాస్టర్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (114 ఇన్నింగ్స్) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ముఖ్యంగా పేసర్లను లక్ష్యంగా చేసుకుని ఆసీస్ ఓపెనర్లు బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. హాఫ్ సెంచరీల తర్వాత వేగం పెంచిన వార్నర్ మొదట శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ ఫించ్ సెంచరీ సాధించాడు. వీరి దాటికి భారత పేసర్లు 7కు పైగా రన్ రేట్ సమర్పించుకున్నారు. మహ్మద్ షమీ వేసిన 38వ ఓవర్ 4 బంతిని వార్నర్ ఫోర్ కొట్టి విజయతీరాలకు చేర్చాడు. దీంతో మరో 74 బంతులు మిగిలుండగానే 256 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఆసీస్ ఛేదించింది. భారత్‌పై ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని (258) వార్నర్, ఫించ్ జోడీ నమోదు చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..