న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల స్టేడియంలో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో ఆసిస్ చేతిలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఈ వన్డే సిరీస్‌ 2-3తో ఆసీస్ సొంతం చేసుకుంది. సిరీస్ ఫలితం తేల్చిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆసిస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 237 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ (55), కేదార్ జాదవ్ (44), భువనేశ్వర్ కుమార్ (46) జట్టును గెలిపించేందుకు కృషిచేసినా.. వారి శ్రమకు ఫలితం లేకుండాపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా మూడు వికెట్లు, కమిన్స్, రిచర్డ్స్, స్టోయిన్స్ రెండేసి వికెట్లు, లియాన్ ఒక వికెట్ తీసుకున్నారు. 


ఈ మ్యాచ్‌తో వన్డేల్లో 8000 పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. 200 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ ఈ రికార్డ్ పూర్తిచేసి టీమిండియా మాజీ కెప్టేన్ సౌరబ్ గంగూలి రికార్డ్ సమం చేశాడు. ఇదే మైలురాయిని విరాట్ కోహ్లీ 175, ఏడీ డివిలియర్స్ 185 మ్యాచ్‌ల్లో అందుకున్నారు.