న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ వెండి పతకాన్ని గెలుచుకున్న తెలుగుతేజం పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఏప్రిల్ 4 నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న గోల్డ్ కోస్ట్- 2018 కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత మువ్వన్నెల పతాకాన్ని పట్టుకొని భారత బృందానికి నాయకత్వం వహించే అవకాశం పీవీ సింధుకు లభించింది. చివరి మూడు కామన్వెల్త్ క్రీడల తరువాత ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక కావడం ఇదే తొలిసారి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత జట్టులో స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్, మరో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో సింధు బ్రహ్మాండమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆమెను పతాకధారిగా ఎంపిక చేసినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఒక ప్రకటనలో తెలిపింది.


2006లో మెల్‌బోర్న్‌ కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్లో, ఏథెన్స్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన షూటర్, ప్రస్తుత క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ భారత బృంధానికి నాయకత్వం వహించారు. 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్లో.. బీజింగ్ ఒలింపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో.. లండన్ ఒలింపిక్స్‌ సిల్వర్ మెడలిస్ట్ షూటర్ విజయ్ కుమార్ ఫ్లాగ్ బేరర్‌గా బాధ్యతను నిర్వర్తించాడు.