ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మూడో పతకం కూడా వచ్చి చేరింది. పురుషుల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్ విభాగంలో దీపక్ కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ సంవత్సరం జరిగిన ఆసియా క్రీడల్లో మనదేశానికి దక్కిన తొలి రజత పతకం ఇదే. ఇప్పటికే ఒక స్వర్ణం, ఒక కాంస్యాన్ని ఖాతాలో వేసుకున్న భారత్.. ఇప్పుడు మరో రజతం కూడా చేజిక్కించుకుంది. అలాగే షూటింగ్‌లో ఈ గేమ్స్‌లో మన దేశానికి ఈసారి లభించిన రెండవ పతకం ఇది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్ టీమ్‌ విభాగంలో నిన్న  అపూర్వి చండేలా-రవికుమార్‌ జంట కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా జరిగిన 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్ విభాగం సింగిల్స్‌లో చైనా ఆటగాడు హోరాన్‌ యాంగ్‌ 249.1 పాయింట్లతో బంగారు పతకాన్ని గెలుచుకోగా.. దీపక్ కుమార్ కేవలం 247.7 పాయింట్లతో రజత పతకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈ సారి భారత్ అన్ని విభాగాల్లో కలిసి 500 పైగా క్రీడాకారులను ఆసియా క్రీడలకు పంపించడం జరిగింది. 


తాజాగా  ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న దీపక్ కుమార్ 2017 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. అలాగే 2018లో జరిగిన ఐఎస్ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు.