IND vs AUS 1st Test Highlights: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఘనంగా ఆరంభించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో 132 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. కేవలం రెండున్నర రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగిసిపోవడం విశేషం. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. టీమిండియా 400 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే కుప్పకూలింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు మ్యాచ్ఫి ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభంకానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

321 పరుగులతో మూడో రోజు ప్రారంభించిన భారత్.. ఆరంభంలోనే రవీంద్ర జడేజా (70) వికెట్ కోల్పోయింది. తరువాత మహ్మద్ షమీ 47 బంతుల్లోనే 37 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇందులో 3 సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్ (84) కూడా దూకుడుగా ఆడాడు. చివరకు స్కోర్ బోర్డు 400 పరుగులు చేరగానే.. అక్షర్ పటేల్ ఔట్ అవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్‌కు 223 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.


223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూ జట్టును టీమిండియా స్పిన్నర్లు కంగారెత్తించారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడిపోయారు. ఉస్మాన్ ఖవాజా (5), డేవిడ్ వార్నర్ (10)లను అశ్విన్ ఔట్ చేయగా.. లబుషేన్ (17)ను రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపించాడు. ఓ ఎండ్ స్మిత్ (25 నాటౌట్) క్రీజ్‌లో పాతుకుపోయినా.. అవతలి ఎండ్ నుంచి సహకారం కరువైంది. బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా డగౌట్‌కు క్యూకట్టారు. చివరకు 91 పరుగులకే కుప్పకూలి 132 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ తలో రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్ములేపిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.