IND vs WI: సరిగ్గా పరిగెత్తడం కూడా రాదా?.. టీమిండియా క్రికెటర్‌పై మండిపడిన రోహిత్ శర్మ (వీడియో)!!
Rohit fires on Chahal: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన లేజీ తనంతో కెప్టెన్ రోహిత్ శర్మకి కోపం తెప్పించాడు.
Rohit Sharma fires on Yuzvendra Chahal: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాట్‌తో ఆ తర్వాత బంతితో సత్తాచాటిన భారత్ 44 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (64; 83 బంతుల్లో 5×4) జట్టును ఆదుకున్నాడు. అనంతరం ఛేదనలో విండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. 9 ఓవర్లు వేసిన ప్రసిద్ధ్ కృష్ణ కేవలం 12 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచులో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన లేజీ తనంతో కెప్టెన్ రోహిత్ శర్మకి కోపం తెప్పించాడు. లక్ష్య ఛేదనలో విండీస్ ప్లేయర్ ఓడెన్ స్మిత్ (24: 20 బంతుల్లో 1x4, 2x6) వేగంగా ఆడటంతో 44 ఓవర్లు ముగిసే సమయానికి కరేబియన్ జట్టు 190/8తో నిలిచింది. స్మిత్ భారీ షాట్లు ఆడుతుండడంతో టీమిండియాలో కాస్త కంగారు పెరిగింది. వికెట్ పడగొట్టేందుకు సారథి రోహిత్ బౌలింగ్ మార్పు చేశాడు. దాంతో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రంగంలోకి దిగాడు. మరోవైపు ఫీల్డింగ్‌లోనూ రోహిత్ మార్పు చేశాడు. ఈ క్రమంలో చహల్‌ని లాంగాఫ్‌లోకి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు.
ఎక్కువగా థర్డ్ మ్యాన్, డీప్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసే యుజ్వేంద్ర చహల్.. రోహిత్ శర్మ లాంగాఫ్‌లోకి వెళ్లమని చెప్పగానే కాస్త నెమ్మదించాడు. ఇది గమనించిన రోహిత్ అతడిపై కాస్త ఫైర్ అయ్యాడు. 'ఏమైంది నీకు, సరిగ్గా పరిగెత్తడం కూడా రాదా?, తొందరగా అక్కడికి పరిగెత్తు' అని రోహిత్ ఫైర్ అయ్యాడు. రోహిత్ గట్టిగా అరవడం స్టంప్ మైక్‌లో రికార్డైంది. రోహిత్ శర్మకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కూల్ కెప్టెన్ హాట్ అయ్యాడే, కూల్ రోహిత్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వాషింగ్టన్ సుందర్ వేసిన 45వ ఓవర్‌లో భారీ షాట్ ఆడిన ఓడెన్ స్మిత్.. డీప్ మిడ్ వికెట్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అంతకుముందు కూడా నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్‌లను కూడా ఔట్ చేయడానికి రోహిత్ శర్మ రచించిన వ్యూహం పనిచేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ అద్భుతమైన కెప్టెన్సీ మరోసారి అందరిని ఆకట్టుకుంది. ఇక యుజ్వేంద్ర చహల్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. మొదటి వన్డేలో మణికట్టు స్పిన్నర్ చహల్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Also Read: India Covid Cases Today: దేశంలో భారీగా తగ్గిన కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook