ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ జట్టు మరోసారి వైఫల్యం చెందింది. ఇంగ్లాండ్‌ బౌలర్ల ప్రతాపానికి భారత్ కేవలం 35.2 ఓవర్లకే చాప చుట్టేసింది. వరుణుడి అత్యుత్సాహం వల్ల గురువారం జరగాల్సిన మ్యాచ్‌ ఒక్క రోజు తేడాతో శుక్రవారం జరిగింది. తొలుత టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఆదిలోనే హంసపాదు అన్నరీతిలో కేఎల్‌ రాహుల్‌(8; 14బంతుల్లో 2×4)తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన మురళీ విజయ్‌ డకౌట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అండర్సన్‌ వేసిన ఐదో బంతికే విజయ్‌ బౌల్డ్‌ అవ్వడం గమనార్హం. తర్వాత అండర్సన్‌ ఏడో ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ను సైతం అవుట్ చేశాడు. కొంతమేర పుజారా(1; 25 బంతుల్లో) పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నించినా.. బాల్స్ వేస్ట్ అవ్వడం తప్పించి ఫలితం ఏమీ కానరాలేదు. కాగా.. తొమ్మిదో ఓవర్‌లో పుజారా రనౌట్‌ అయ్యాడు. దీంతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత పూర్తిగా కెప్టెన్‌ కోహ్లీ మీదే పడింది. అయితే క్రిస్‌ వోక్స్‌ వేసిన 22 ఓవర్‌ నాలుగో బంతికి కోహ్లీ(23; 57 బంతుల్లో 2×4) బట్లర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో భారత్ జట్టులో ఉత్సాహం సన్నగిల్లింది. 


తర్వాత వచ్చిన హార్ధిక్ పాండ్య(11; 10బంతుల్లో 2×4), దినేశ్‌ కార్తీక్‌(1; 3బంతుల్లో) కూడా పెద్దగా రాణించలేదు. ఆ సమయానికి 25 ఓవర్లకే భారత్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. చివర్లో రహానె (18; 44బంతుల్లో 2×4), అశ్విన్‌(29; 38బంతుల్లో 4×4) కూడా సాధ్యమైనంత వరకూ ప్రయత్నించి ఎట్టకేలకు  ఔట్‌ కావడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్‌ బౌలర్ అండర్సన్‌ ధాటికి అయిదు వికెట్లు సమర్పించుకుంది.