కోల్ కతా: ఈడెన్ గార్డెన్ వేదికగా టీమిండియా, శ్రీలంక మధ్య జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసింది. ఒకనొక దశలో ఓటమి దిశగా పయనిస్తున్న భారత్ ను.. కెప్టెన్ కోహ్లీ సురక్షిత తీరాలకు చేర్చాడు. 120 పరుగులు వెనకబడి.. క్లిష్ట స్థితిలో రెండో ఇన్నింగ్ ప్రారంభించిన టీమిండియా... కెప్టెన్ కోహ్లీ సెంచరీతో కదంతొక్కడంతో 8 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. ఆట చివరి రోజు కావడంతో విజయంపై గురిపెట్టిన టీమిండియా.. ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసి..230 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది.


ఈ క్రమంలో రెండో ఇన్నింగ్ ప్రారంభించిన శ్రీలంక త్వరత్వరగా వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది..కేవలం 75 పరుగులకే కీలక ఏడు వికెట్లు కోల్పయి దిక్కుతోచనిస్థితిలో నిలబడింది. అయితే సమయం ముగిసిపోవడంతో ఓటమి నుంచి శ్రీలంక గట్టెక్కింది. తొలి ఇన్నింగ్‌లో టీమిండియా 172 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. అయితే అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 294 పరుగులు సాధించి భారత్ పై 122 పరుగల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్ లో బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో టీమిండియాపై విజయం సాధించలేకపోయింది లంక జట్టు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంకేయులు పోరాటపటిన ప్రదర్శించారు. ఫలితంగా టెస్టు డ్రా చేసుకోగలిగారు.