డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెడుతున్నారు. రెండున్నరేళ్ల కిందటే రిటైర్మెంట్‌ ప్రకటించిన వీరూ మళ్లీ ఐపీఎల్‌లో ఆడనున్నారట. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీకి అన్నీ తానై వ్యవహరిస్తోన్న వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ ఐపీఎల్ బరిలో దిగనున్నారని సమాచారం.  ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్‌ ఫించ్‌ పెళ్లి ఉండటంతో తొలి మ్యాచ్‌కు అతడి స్థానంలో సెహ్వాగ్ ఏప్రిల్ 8న మొహాలీ వేదికగా ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ తరఫున ఓపెనింగ్ చేయనున్నారన్న వార్త ఆదివారం హల్ చల్ చేసింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో భాగంగానే ఆదివారం చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ట్వీట్‌లో సెహ్వాగ్ మళ్లీ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడని ఉంది. ఇదిలా ఉంచితే ఆ ట్వీట్ కింద యువరాజ్ సింగ్ ట్వీట్ చేస్తూ.. సెహ్వాగ్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను మళ్లీ ఆడితే చూడాలని ఉంది' అంటూ యువీ ట్వీట్‌ చేశాడు. ఇది చూసి వీరూ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.



కానీ రాత్రికి కానీ అసలు విషయం తెలియలేదు. ఏప్రిల్‌ 1న జనాల చెవుల్లో పూలు పెట్టేందుకు వీరూ బృందం వేసిన ఎత్తుగడ ఇది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేసిన ట్వీట్‌ను యువరాజ్ సింగ్ రీట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కంటే ముందే.. ఇవాళ ఏప్రిల్ 1, ఫూల్స్ డే.. ఎవరేం చెప్పినా నమ్మొద్దంటూ యువీ ట్వీట్ చేశాడు. కొంపదీసి వీరూ ఓపెనర్‌గా ఆడటం కూడా మనల్ని ఫూల్ చేయడం కోసమేనా?




నిజానికి అసలు ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు ముందే టోర్నీ నిర్వాహకుల వద్ద రిజిస్టర్‌ చేయించుకుని ఉండాలి. ఇలా సహాయ సిబ్బందిగా ఉన్న వాళ్లు ఎప్పుడనుకుంటే అప్పుడు మ్యాచ్‌ ఆడేసే అవకాశమే లేదు. ఈ సంగతి తెలిసిన వాళ్లు, ఆదివారం ఏప్రిల్‌ 1 అని గుర్తెరిగినవాళ్లు ఈ వార్తను తేలిగ్గానే తీసుకున్నారు.