ఐపీఎల్‌ని నిలిపేయాల్సిందిగా పిల్ దాఖలు చేసిన ఐపీఎస్ ఆఫీసర్
ఈ ఏడాది ఐపీఎల్ జరగకుండా నిలిపేయాలంటూ మద్రాస్ హైకోర్టులో తాజాగా ఓ పిల్ దాఖలైంది.
ఈ ఏడాది ఐపీఎల్ జరగకుండా నిలిపేయాలంటూ మద్రాస్ హైకోర్టులో తాజాగా ఓ పిల్ దాఖలైంది. ఐపీఎల్‌లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటి అవినీతి కార్యకలాపాలు జరగకుండా నిర్వాహకులు ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, అటువంటప్పుడు ఐపీఎల్‌లో అవినీతి జరిగేందుకు ఆస్కారం కూడా లేకపోనందున ఐపీఎల్‌ని ఆపేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సంపత్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 7వ తేదీనే ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం పిటిషనర్ అనుమానాన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌ని నిలిపేయడాన్ని క్లిష్టమైన నిర్ణయంగా భావించిన కోర్టు.. ఈ పిల్ విచారణను ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా వేసింది.
గతంలో స్వయంగా తానే ఒక విచారణ అధికారిగా ఐపీఎల్‌లో బెట్టింగ్ కుంభకోణాన్ని బయటపెట్టానని సంపత్ కుమార్ ఆ పిల్‌లో పేర్కొన్నారు. అయితే, వాస్తవానికి ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌లో బుకీల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు సంపత్ కుమార్‌ని నాలుగేళ్ల పాటు సస్పెండ్ చేశారు. 2018 మార్చిలో సంపత్ కుమార్‌పై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేయడంతో తిరిగి విధుల్లో చేరిన ఆయన ప్రస్తుతం తమిళనాడు పోలీస్ క్యూ బ్రాంచ్‌లో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
తాను ఐపీఎల్‌పై నిషేధం విధించాలని కోరడం లేదని, కాకపోతే కొత్తగా సీజన్ మొదలయ్యే ముందే బెట్టింగ్ నిరోధించే ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నదే తన విజ్ఞప్తి అని సంపత్ తన పిల్ ద్వారా మద్రాస్ హై కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.