టీమిండియా బౌలర్ మహ్మద్ షమీపై బీసీసీఐ అప్పుడే చర్యలకు ఉపక్రమించింది. బీసీసీఐ విడుదల చేసిన ప్లేయర్స్ కాంట్రాక్ట్ జాబితాలో మహ్మద్ షమి పేరుని చేర్చకపోవడమే అందుకు నిదర్శనంగా క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అవును, తాజాగా ఈ ఏడాది ఆటగాళ్ల వేతనాలు పెంచుతున్నట్టుగా బీసీసీఐ ప్రకటించిన జాబితాలో షమీ పేరు లేదు. మహ్మద్ షమీ మహిళల జీవితాలతో ఆడుకుంటాడని, అతడికి ఇప్పటికే అనేకమంది మహిళలతో సంబంధం వుందని షమి భార్య హసిన్ జహాన్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. త‌నకన్నా ముందుగా పాకిస్తాన్‌కు చెందిన ఓ మ‌హిళను వివాహం కూడా చేసుకున్నాడన్న ష‌మీ భార్య హసీన్ జహాన్.. ఇంట్లోనూ తనని చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహ్మద్ షమిపై గృహహింస కేసు పెట్టి కోర్టులోనే తేల్చుకుంటాను అని హసీన్ జహాన్ చేసిన ఆరోపణలు అతడిని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. 


మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కిన ఈ వార్తలపై స్పందించిన మహ్మద్ షమీ.. ఈ వార్తా కథనాల్లో నిజం లేదు అని స్పష్టంచేశాడు. తన క్రికెట్ కెరీర్‌ని నాశనం చేసేందుకు ఎవరో చేస్తున్న కుట్రగా జహాన్ ఆరోపణలను కొట్టిపారేశాడు షమి. ఇదిలావుంటే, హసీన్ జహాన్ ఆరోపణలు సంచనం సృష్టించిన నేపథ్యంలో ఆటగాళ్లతో ఒప్పందాల విషయంలో బీసీసీఐ విడుదల చేసిన కొత్త జాబితాలో షమీ పేరుని చేర్చకపోవడానికి కారణం అతడిపై వెల్లువెత్తిన ఆరోపణలే అనే టాక్ వినిపిస్తోంది.