ధోనిపై కపిల్ దేవ్ ప్రశంసలు.. 2019 వరల్డ్ కప్ గురించి కీలక వ్యాఖ్యలు!
మహేంద్ర సింగ్ ధోనిపై కపిల్ దేవ్ ప్రశంసల జల్లు
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై టీమిండియా మాజీ కెప్టేన్, స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించారు. తన కెరీర్‌లో 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి అద్భుతంగా రాణించిన ధోని అంతిమంగా ఔత్సాహిక యువ క్రికెటర్లకు అవకాశం కల్పించేందుకే టెస్ట్ కెరీర్ నుంచి తప్పుకున్నాడని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. నిస్వార్థంగా దేశం కోసం పాటుపడే క్రికెటర్ ధోనీ. భారత క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీయే గొప్ప ఆటగాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని కపిల్ దేవ్ కితాబిచ్చారు. 2011 ప్రపంచ కప్ పోటీల్లో ధోనీ నేతృత్వంలో టీమిండియా అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ధోనీ నేతృత్వంలో టీమిండియా టీ20 ప్రపంచ కప్‌ను కూడా గెలుపొందిందని ఈ సందర్భంగా కపిల్ దేవ్ గుర్తుచేసుకున్నారు. ధోనీపై ప్రశంసలు గుప్పించే క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్‌లోనూ ధోనీ ఆడతాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కపిల్ తెలిపారు.
1983లో కపిల్ దేవ్ సారధ్యంలో ప్రపంచ కప్ గెల్చుకున్న టీమిండియా ఆ తర్వాత మళ్లీ ప్రపంచ కప్ గెల్చుకుంది ధోనీ కెప్టేన్సీలోననే సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఐసీసీలోని అన్ని ట్రోఫీలలోనూ జట్టును గెలిపించి కప్ అందుకున్న ఏకైక స్కిప్పర్ కూడా ధోనీనే కావడం విశేషం. 2014లో టెస్ట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన ధోనిపై ఇప్పటివరకు ప్రశంసలు గుప్పించని క్రికెట్ దిగ్గజం లేడంటే అతిశయోక్తి కాదు. అందుకే అతడు కేవలం ఇండియాకు చెందిన క్రికెట్ ప్రియులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులకు తమ ఫేవరైట్ క్రికెటర్ అయ్యాడు. దటీజ్ ది గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనీ!!