నిదహాస్ ట్రోఫీ 2018: లంకపై ప్రతీకారానికి భారత్ తహతహ
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నేడు కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నేడు కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రీలంక జట్టు ఇప్పటికే భారత్‌పై గెలిచి అదే ఫీట్‌ను మరోసారి కొనసాగించి ఫైనల్‌కి వెళ్లాలని యోచిస్తుండగా.. తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు జియో స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇరుజట్ల బలాబలాలు
టీమిండియా విషయానికి వస్తే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ట్రైసిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఒక్క రోహిత్ తప్ప మిగతా జట్టు ఓపెనర్లు అందరూ తమను తాము నిరూపించుకున్నారు. టీమిండియా తరఫున శిఖర్ ధావన్ రెండు అర్థసెంచరీలు చేయగా, బంగ్లాదేశ్ ఓపెనర్లు తమీమ్, లిటన్ దాస్‌లు మంచి భాగస్వామ్యాన్ని అందించి జట్టు విజయానికి దోహదపడ్డారు. ఇక శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ ఓ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేయగా, గుణతిలక ఫర్వాలేదనిపిస్తున్నాడు.
కాగా.. సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచుల్లోనూ చేజింగ్ చేసిన జట్లే విజయం సాధించడం కొసమెరుపు. మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా లంక కెప్టెన్ చండిమాల్ మీద రెండు మ్యాచ్‌ల నిషేధం విధించడంతో భారత్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అతను మరీ నిదానంగా బౌలింగ్ చేసినందుకు ఈ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇదే తప్పిదానికి బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా కూడా 20 శాతం మ్యాచ్ ఫీజును కోల్పోనున్నాడు.
ఇటు జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సురేశ్ రైనా, రాహుల్/రిషభ్ పంత్, మనీశ్‌పాండే, దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, చహల్, విజయ్ శంకర్, శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్.
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), లక్మల్, తరంగ, గుణతిలక, కుశాల్ మెండిస్, షనక, కుశాల్ పెరీరా, జీవన్ మెండిస్, నువాన్ ప్రదీప్, చమీర, ధనంజయ డిసిల్వా.