బాసిల్ (స్విట్జర్లాండ్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ద్వారా తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన సెమీ-ఫైనల్‌లో 21-7, 21-14 స్కోరుతో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ యుఫీని ఓడించిన పీవి సింధు.. నేడు ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ 4 స్థానంలో కొనసాగుతున్న జపాన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహారపై వరుస సెట్లలో 21-7, 21-7 తేడాతో విజయం సాధించి ప్రపంచ చాంపియన్‌షిప్ విమెన్స్ సింగిల్స్ విజేతగా మరో అరుదైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా పీవి సింధు చరిత్ర సృష్టించింది. 


ఇప్పటికే రెండుసార్లు ఫైనల్‌ వరకు వెళ్లి స్వర్ణాన్ని చేజార్చుకున్న పీవి సింధు.. ఈసారి మరింత కసితో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ భారత్‌కి స్వర్ణాన్ని సాధించిపెట్టిన పీవి సింధుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. కష్టే ఫలి అన్నట్టుగా తాను చాంపియన్‌‌షిప్ గెలిచే వరకు తన పోరాటం ఆగదని చెప్పడమే కాకుండా తన మాటలను నిజం చేసిచూపించిన పీవి సింధును ఎవరైనా అభినందించి తీరాల్సిందే మరి.