ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రముఖ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ని కెప్టేన్‌గా నియమిస్తూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ఏసిబి) సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసిసి ప్రపంచ కప్ సమరానికి కొద్ది రోజుల ముందే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కెప్టేన్‌గా గుల్బదిన్ నైబ్‌ని నియమించిన ఏసిబి.. తాజాగా అతడిని ఆ స్థానం నుంచి రషీద్ ఖాన్‌ని నియమించింది. వన్డే, టెస్ట్, టీ 20 ఫార్మాట్లలో అతడే ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టేన్ అని తేల్చిచెప్పింది. అస్ఘర్ అఫ్ఘాన్‌ని వైస్-కెప్టేన్‌గా నియమిస్తూ ఏసిబి ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 


గుల్బదీన్ నైబ్ కెప్టేన్సీలో ఐసిసి ప్రపంచ కప్ సమరంలో ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడం ఏసిబి సంచలన నిర్ణయానికి ఓ కారణమైతే... పర్‌ఫార్మెన్స్ పరంగా రషీద్ ఖాన్ తనని తాను మెరుగుపర్చుకుంటుండం మరో కారణం అయ్యుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్, పాకిస్తాన్ వంటి దేశాలతో ఆడిన మ్యాచ్‌ల్లో నరాలు తెగే ఉత్కంఠరేపేలా ప్రత్యర్థులకు గట్టిపోటీనిచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. ఆఖరికి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఐసిసి వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే