విశాఖపట్టణం: టీమిండియా స్పిన్ కింగ్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో బ్రియాన్ వికెట్‌ను తీయడం ద్వారా 350 టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రవిచంద్రన్ రికార్డులకెక్కాడు. ఈ రికార్డుతో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ సరసన అశ్విన్ నిలిచాడు. 2010లో క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన ముత్తయ్య మురళీధరన్.. కెరీర్‌లో 800 వికెట్స్ తీసుకోవడం విశేషం. 350 టెస్ట్ వికెట్స్ క్లబ్‌లో ఈ ఇద్దరిలో ఎవరు ముందు, ఎవరు వెనుక అని పోల్చడానికి వీల్లేకుండా ఈ ఇద్దరూ 66వ టెస్టు మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం మరో విశేషం. 


ఇదివరకు ఈ ఘనత సాధించిన టీమిండియా దిగ్గజ స్పిన్నర్లలో అనిల్ కుంబ్లే (77వ టెస్ట్), హర్భజన్‌ సింగ్ (83వ టెస్ట్) ఉన్నారు. ఈ ఇద్దరినీ అధిగమించి ఆర్ అశ్విన్ 66 టెస్ట్ మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.