క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా క్రికెట్ రంగంలో కొనసాగుతున్న ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రికి భిన్నంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ స్వతహాగా ఆల్ రౌండర్ అయిన 19 ఏళ్ల అర్జున్... ఇప్పుడిప్పుడే  ఆటలో నైపుణ్యం సాధిస్తున్నాడు. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబయి టి20 క్రికెట్ లీగ్ లో పాల్గొంటున్నాడు. అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆకాశ్ టైగర్స్ జట్టు సెమీస్ కు చేరింది. ఈ సందర్భంగా కొడుకు ప్రాక్టీస్ చేస్తున్న విధానాన్ని సచిన్ దగ్గరుండి పరిశీలించాడు.


కెరీర్ కు సంబంధించిన కీలక దశలో ఉన్న కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు సచిన్ హితబోధ చేశాడు. క్రీడా మైదానంలో రాణించడానికి ఏం చేయాలనే దానిపై కొన్ని చిక్కాలు చెప్పారు. జీవితంలో కష్టపడి పైకిరావాలే తప్ప విజయం కోసం అడ్డదారుల్లో వెళ్లకూడదని సూచించాడు. ఈ సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడుతూ నచ్చినపని చేయడం కోసం సన్మార్గంలోనే పయనించాలి...పక్కదారుల్లో వెళ్లకూడదని చెప్పాను... ఇది మా నాన్న నాకు చెప్పారు..ఇదే విషయాన్ని ఇప్పుడు నా కొడుక్కి చెబుతున్నాను అంటూ సచిన్ పేర్కొన్నాడు.