ఘనంగా క్రికెటర్ స్టీవ్ స్మిత్ వివాహం
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు మరియు ప్రేయసి డానీ విల్లీస్‌ని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనేక సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఈ రోజు ఒకటవ్వడంతో.. ఆస్ట్రేలియాలో పలువురు క్రికెటర్లు కూడా హర్షం వ్యక్తం చేశారు. 29 ఏళ్ల స్టీవ్ స్మిత్, మెకరీ యూనివర్సిటీలో లా కోర్సు చేసిన విల్లీస్‌తో సాగించిన ప్రేమాయణం గురించి గతంలో కూడా చాలా కథలు మీడియాలో హల్చల్ చేశాయి.
గత సంవత్సరం జులైలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి నిశ్చితార్థం తర్వాతే బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో స్మిత్ పై వేటు పడింది. ఆ తర్వాత ఆయన కెప్టెన్ పదవితో పాటు జట్టులో స్థానాన్ని కూడా కోల్పోయారు. ఈ క్రమంలో డానీతో స్మిత్ పెళ్లి జరుగుతుందా? లేదా అన్న విషయంలో కూడా కాస్తా సందిగ్ధం ఏర్పడింది. అయితే స్మిత్ ప్రేయసి డానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పెళ్లి తంతు పట్టాలెక్కిందని కూడా వార్తలు వస్తున్నాయి.
ఘనంగా జరిగిన స్మిత్ పెళ్లి వేడుకలకు తోటి క్రికెటర్లకు కూడా ఆహ్వానం అందింది. అరోన్ ఫించ్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్ వంటి మేటి క్రికెటర్లు అందరూ ఈ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆహ్వానం అందినా సరే ఈ పెళ్లికి డేవిడ్ వార్నర్ హాజరు కాలేదని తెలుస్తోంది. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో స్మిత్‌తో పాటు వేటుకు గురైన క్రికెటర్లలో వార్నర్ కూడా ఒకడనే సంగతి మనకు తెలిసిందే. మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో స్మిత్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు.