సన్ రైజర్స్ బౌలర్ల మాయాజాలం ఓసారి మళ్లీ పనిచేసింది. రాజస్థాన్ రాయల్స్‌ను కేవలం 11 పరుగుల తేడాతో ఓడించినా.. వారి బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసిన విధానం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. కేవలం 6 వికెట్లే పడగొట్టినా.. ప్రత్యర్థులకు చూపించాల్సిన చుక్కలు చూపించారు. ఫలితంగా పాయింట్ల జాబితాలో టాప్ ర్యాంకుకి చేరుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్ బ్యాట్స్‌మన్ విషయానికి వస్తే అజింక్య రహానే (65 నాటౌట్) కొంత పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నించినా.. సహకరించే వారు లేకపోవడంతో ఒంటరి పోరాటమే చేయాల్సి వచ్చింది. సంజూ శాంసన్ (30 బంతుల్లో 40 పరుగులు) కూడా జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించినా.. తను కూడా అవుట్ అవ్వడంతో.. ఆ తర్వాత వచ్చినవారెవరూ సన్ రైజర్ల ముందు పెద్దగా నిలవలేకపోయారు. ఫలితంగా విజయాన్ని చేతుల్లో పెట్టి మరీ ఇచ్చారు


తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ (63; 43 బంతుల్లో 7×4, 2×6), అలెక్స్‌ హేల్స్‌ (45; 39 బంతుల్లో 4×4) తమదైన శైలిలో ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరీ భారీ స్కోరు చేయకపోయినా... ప్రత్యర్థిని దీటుగానే ఎదుర్కొన్నారు. 152 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థులకు నిర్దేశించారు. కానీ రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగాక సీన్ రివర్స్ అయ్యింది.


72 రన్స్ వద్ద సంజూ, 73 రన్స్ వద్ద బెన్‌స్టోక్స్‌, 96 రన్స్ వద్ద బట్లర్‌ మొదలైన వారు పెవిలియన్ బాట పట్టడంతో ఆట ఆసక్తికరంగా మారింది. అయినా సిద్ధార్థ్‌ కౌల్ (2 వికెట్లు)‌, సందీప్‌ శర్మ, బసిల్‌ థంపి, రషీద్‌ ఖాన్‌, యూసఫ్‌ పఠాన్‌ లాంటి బౌలర్లు సన్ రైజర్స్‌‌కు సేవింగ్ హ్యాండ్స్‌లా మారారు. జట్టుకి విజయాన్ని అందించారు.