T20 World Cup 2021 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో గెలిచేదెవరు?
T20 World Cup 2021 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి (నవంబరు 14) జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. అయితే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ కు ఇదే తొలిసారి. మరోవైపు ఆస్ట్రేలియా రెండో సారి ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మరి ఈ రెండు టీమ్స్ లో ఎవరు విజేతగా నిలిచి టోర్నీని ముద్దాడుతారో తెలియాల్సిఉంది.
T20 World Cup 2021 Final: టీ20 వరల్డ్ కప్ లో (T20 World Cup Final) తన అనుభవాన్ని సద్వినియోగం చేసుకొని.. న్యూజిలాండ్ టీమ్ కట్టడి చేయాలని ఆస్ట్రేలియా వ్యూహాలు రచిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా కనిపిస్తున్న కివీస్ జట్టు.. ఫైనల్ మ్యాచులో (AUS vs NZ T20 Final) పూర్తి ఆధిపత్యం కనబర్చాలని యోచిస్తున్నారు. న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా కెప్టెన్, జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు మంచి రికార్డే ఉంది. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఫామ్‌లో ఉండటం.. ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నీలో స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ పెద్దగా రాణించలేదు. తుదిపోరులో సత్తా చాటితే కివీస్‌పై విజయం పెద్ద కష్టమేమీ కాదని.. ఆస్ట్రేలియా అంచనా వేస్తోంది.
మరోవైపు సెమీఫైనల్లో పాకిస్తాన్ పై అద్భుతంగా రాణించిన మార్కస్ స్టోయినిస్, మ్యాథ్యూ వేడ్ కూడా జోరు కొనసాగించాలని ఆస్ట్రేలియన్ టీమ్ భావిస్తోంది. బౌలింగ్ విభాగంలోనూ.. ఆ టీమ్ బలంగా కనిపిస్తోంది. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్‌వుడ్‌లతో.. పేస్ దళం పటిష్టంగా ఉంది. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా టోర్నీలో ఇప్పటివరకు 12 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్లను హడలెత్తించాడు. ఫైనల్‌లో ఆఫ్ స్మిన్నర్ మ్యాక్స్‌వెల్ కూడా రాణిస్తే.. న్యూజిలాండ్‌ను సులభంగా కట్టడి చేయవచ్చని ఆసీస్ అంచనా వేస్తోంది.
ఈసారి విజేతగా నిలుస్తుందా?
2019లో జరిగిన వన్డే వరల్డ్ కప్ నుంచి మెరుగైన ఆటతీరు కనబరుస్తూ వస్తున్న న్యూజిలాండ్ టీమ్.. ఈసారి ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ఒడిసిపట్టాలని వ్యూహాలు రచిస్తోంది. బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న కివీస్.. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో బ్యాటింగ్‌లోనూ సత్తాచాటింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌కు.. ఆసీస్‌పై మెరుగైన రికార్డు ఉంది. మరో ఓపెనర్ డేరిల్ మిచెల్ కూడా రాణిస్తే.. మంచి ఆరంభాన్ని అందుకోవచ్చని జట్టు అంచనా వేస్తోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇప్పటివరకు టోర్నీలో మెరుగైన ఆటతీరు కనబర్చలేదు. కీలకపోరులో సత్తాచాటితే.. ఆసీస్ జోరుకు కళ్లెం వేయవచ్చని జట్టు భావిస్తోంది. జిమ్మీ నీషమ్ మెరుగ్గా రాణిస్తుండడం కివీస్‌కు కలిసిరానుంది.
అయితే సెమీస్‌లో ఔటయిన వెంటనే అసహనంతో బ్యాట్‌ను చేతికేసి కొట్టుకున్న డేవాన్ కాన్వే.. కుడి చేయి ఎముక విరగడం వల్ల జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్ ఆడే అవకాశం ఉంది. న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం.. టిమ్ సోథి, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మైనేలతో పటిష్టంగా ఉంది. లెగ్ స్మిన్నర్ ఐష్ సోథి సైతం మెరుగ్గానే రాణిస్తున్నాడు. ఐసీసీ టోర్నీల్లో మెరుగ్గా రాణిస్తున్నా.. తుదిపోరులో ఒత్తిడిని అధిగమించలేక తడబడడం కివీస్‌కు ప్రతికూలంగా ఉంది. అయితే.. విలియమ్సన్ కెప్టెన్సీలో 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో అద్భుత పోరాట పటిమ కనబర్చిన న్యూజిలాండ్ ఈసారి టైటిల్ నెగ్గాలని పట్టుదలగా ఉంది.
Also Read: T20 World Cup Final 2021: ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ టీమ్ గెలవడం ఖాయం!’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook