మెల్‌బోర్న్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది.  టీ-20 వుమెన్స్ ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి .. నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళల టీ-20 ప్రపంచ కప్‌లో భారత జట్టు మెరుగ్గా రాణిస్తోంది.  ఇవాళ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ దిగింది. ఐతే ఆరంభంలోనే మన అమ్మాయిలు అదరగొట్టారు. షఫాలీ వర్మ, స్మృతి మందన్న మంచి శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ పరుగులు తీస్తూ .. రాణించారు. ఐతే రెండో ఓవర్‌లోనే భారత్‌కు కాస్త ఎదురు దెబ్బ తగిలింది. స్మృతి మందన్న లీ తహూ చేతిలో క్లీన్ బౌల్డ్ అయింది. ఐతే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తాన్యా భాటియా మంచి స్కోర్ సాధించింది. ఓపెనర్ షఫాలీ వర్మకు మంచి జోడిగా నిలిచింది. దీంతో వీరిద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మొత్తంగా షఫాలీ వర్మ మంచి స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకుంది. ఆమె కేవలం 34 బంతులు ఆడి 46 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత తాన్యా భాటియా 23 పరుగులతో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. మొత్తంగా భారత్..  8 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 133 పరుగులు చేసింది. 


ఆ తర్వాత 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు.. మొత్తం 20 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. విజయానికి 4 పరుగుల దూరంలో న్యూజీలాండ్ ఓడిపోయింది. మొత్తంగా నిర్ణీత ఓవర్లలో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 129 పరుగుల వద్ద చతికిలపడింది. కివీస్ జట్టులో అమేలా ఖేర్ మాత్రమే 34 పరుగులతో రాణించింది. ఆ తర్వాత కెటీ మార్టిన్ 25 పరుగులు చేయడం విశేషం. భారత జట్టులో దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్, రాధా యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.


Read Also: లంకె బిందెలో బంగారు నాణేలు..!!